పుట:కాశీమజిలీకథలు-05.pdf/239

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

245

ముచ్చటించుచున్న ఱేని చెవిలో వైచినది. అశ్రుతపూర్వమగు నవ్వాక్యము విని యజ్జనపతి మేనం బులక లుద్భవిల్ల సంతస మభినయించుచు శుకనాశుని మొగ ముపలక్షించెను. శుకనాశుం డయ్యుత్సవము గ్రహించి దేవా! మనకు వచ్చిన కలలు సత్యములైనవా యేమి? వినుదనుక నా హృదయము తొందరపడుచున్నదని యడిగిన నతండు సంతోషముతో దాదిచెప్పిన మాటల నెరింగించెను.

రాజప్రధాను లిరువురు నిరతిశయసంతోషసముద్రమున మునుంగుచు నప్పుడే శుద్ధాంతమున కరిగి యావార్త సత్యమని తెలిసికొని బ్రాహ్మణులకు షోడశమహాదానంబులును గావించి పుత్రోదయసమయ మరయుచుండిరి.

అంతఁ గాలక్రమంబునఁ బ్రసవసమయము సంపూర్ణమైనంత నద్ధరాకాంతు నిల్లాలు శుభదివసంబున నుత్తమలగ్నంబున నంబుదమాలిక యిరమ్మదమునుబోలె సకలలోకహృదయానందకరుండగు కుమారుం గాంచినది.

అప్పు డంతఃపురజనులు భూమి చలింప నిటునటు పరుగులిడువారును మంగళగీతముల మ్రోగించువారును, తూర్యనినాదములు వెలయించువారునై కోలాహలధ్వనులచే నాదేశమునెల్ల నిండింపఁజేసిరి. ఆ నగరమందే కాక యా దేశమందెల్ల జను లుత్సవములు సేయందొడంగిరి.

తారాపీడుఁడు శుకనాశునితోఁగూడ బుత్రుం జూచు వేడుక ప్రబలదూర్వాప్రవాళమాలాలంకృతంబైన సూతికాగృహంబున కరిగి యందుఁ దొలుత నుదకము నగ్నిని స్పృశించి పిమ్మట విలాసవతి తొడపై దీపమువలెఁ బ్రకాశించుచున్న కుమారు దూరవిస్ఫారితములగు నేత్రములచేఁ బానము జేయువాఁడుంబోలె వీక్షించుచు మిక్కిలి సంతోషించెను. తన్నుఁ గృతకృత్యునిగాఁ దలంచుకొనియెను.

అప్పుడు శుకనాశుం డాబాలకుని యవయవములన్నియు నిరూపించుచు నిట్లనియె. దేవా ! చూడుము. గర్భసంపీడనవశంబునం జేసి యంగశోభస్ఫుటము గాకున్నను జక్రవర్తిచిహ్నములఁ బ్రకటనజేయుచున్నవి.

సంధ్యాకిరణరక్తుండగు బాలశశిరేఖం బురడించు లలాటపట్టిక యందు నళినీతంతువులం బోలిన సూక్ష్మరేఖ లెట్లు ప్రకాశించుచున్నవో పరిశీలింపుము. ఆకార్ణాంతవిశాలములై పుండరీకమువలెఁ దెల్లనై కుటిలములైన కనుబొమ్మలచే ముద్దులు మూట గట్టుచు వెలికాంతుల వెదజల్లుచున్న వీని కన్నుల గంటివా?

సీ. కరతలంబులు సుకోకనదకుట్మలలోహి
         తములు చక్రాదిచిహ్నముల నొప్పె
    బదయుగం బమరద్రుమపల్లవమృదులంబు
         కులిశధ్వజాదిరేఖలఁ దలిర్చె