పుట:కాశీమజిలీకథలు-05.pdf/238

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

244

కాశీమజిలీకథలు - ఐదవభాగము

కేమని వక్కాణింతును. రాత్రింబవళ్ళు ననపత్యతాదుఃఖాగ్ని నన్ను దహించుచున్నది. రాజ్యంబును, జన్మంబును విఫలమని తలంతును. తలోదరీ! కమలగర్భుండు మనకు ప్రసన్నుండు కాడయ్యెను. నే నేమి జేయుదును. నీశోకానుబంధము విడువుము ధైర్య మవలంబింపుము. బుద్ధిని ధర్మకార్యములందుఁ బ్రవేశపెట్టుము. అని శోకాపనోదనిపుణంబులగు ప్రియవాక్యంబులచే నత్తలోదరి నాశ్వాసించి కొంతతడ వందుండి యతండు నిజభవనంబున కఱిగెను.

అదిమొద లమ్మదవతియు దేవతారాధనములయందు బ్రాహ్మణపూజల యందును వెనుకటికన్నఁ బెద్దగా నాదరము గలిగియుండెను. పుత్రోదయహేతుభూతమగు వ్రత మెవ్వ రెట్టిది జెప్పినను గష్టముల కోర్చి యట్టిది గావించునది చండికాయతనంబుల శయనించి యనేకోపవాసములఁ గావించినది. వృద్ధగోపవనితలు మన్నింప స్వరలక్షణసంపన్నంబులగు గోవుల పొదుగులదాపున నిలచి సర్వౌషధీమిశ్రితంబులగు పాలతో స్నానంబు కావించినది. కనకమణివినిర్మతములగు తిలపాత్రముల దానము లిచ్చినది. అనేకసిద్ధాయతనముల సేవించినది. ప్రసిద్ధములగు నాగహ్రదంబుల మునింగినది. అశ్వద్ధప్రభృతివనస్పతులకుఁ బ్రదక్షిణము లొనర్చినది. నడివీథుల దధ్యోదనము వాయసములకు బలివైచినది. భక్తితో నగ్నక్షపణకాదుల నెందరినో ప్రశ్నలడిగినది. నిమిత్తజ్ఞుల నారాధించినది. వృద్ధులు జెప్పిన రహస్యక్రియలన్నిటిని గావించినది. ఉపశ్రుతుల నాలించినది నిమిత్తముల గ్రహించినది. తనకువచ్చు స్వప్నవిశేషంబుల గురువులకు నివేదించునది.

ధృతవ్రతయై యయ్యువతి యట్లు చేయుచుండ నొకనాఁడు తారాపీడుండు అల్పావశేషమగు రాత్రియందు సమున్నతసౌధాగ్రవర్తినియై యున్న విలాసవతీదేవి మొగంబున సకలకలాపరిపూర్ణుండగు చంద్రుండు బ్రవేశించుచున్నట్లు కలఁ గాంచెను. దిగ్గున లేచి సంతోషాతిశయముతో నాక్షణమునందే శుకవాసుని రప్పించి యా వృత్తాంత మెరింగించుటయు హర్షపులకితగాత్రుండై యతం డిట్లనియె.

దేవా! శీఘ్రకాలములో మన ప్రజల మనోరథములు సఫలములుఁ గాగలవు. కొలఁదిదినములలో కుమారముఖావలోకసుఖం బనుభవింపఁగలము. మద్ధర్మపత్ని మనోరమ తొడయం దొకబ్రాహ్మణుండు దివ్యవస్త్రాలంకారభూషితుండై సహస్రదళశోభిత మగుపుండరీక మిడినట్లు నాకును నిన్నరాత్రియే కల వచ్చినది. మంచినిమిత్తములు గనంబడుచున్నవి. శుభోదర్కము దాపుననే యున్నదని పలుకుచున్నంతయుఁ దారాపీడుం డతనిచేయి బట్టుకొని హృదయానందమును వెల్లడించుచు నంతఃపురమునకుఁ దీసికొనిపోయి యిరువుర స్వప్నవృత్తాంతములును విలాసవతి కెరింగించి సంతోషసముద్రమున నోలలాడించెను.

మరికొన్నదినంబులు గతించినంత దేవతాప్రసాదంబున విలాసవతి గర్భవతి యైనది. కులవర్ధన యనుదాసి యొకనాఁడా వృత్తాంతము శుకనాశునితో