పుట:కాశీమజిలీకథలు-05.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

243

గ్రీడాశైలముల యందును నభీష్టకాముడై విహరింపుచు యౌవనమున ననవద్యమగు సుఖం బనుభవించెను.

ఒకనాఁడా యెకిమీడు విలాసవతీభవనంబున కరుగుటయు నప్పు డప్పడఁతి చింతాస్థిమితదీనదృష్టులతో శోకంబున మూకభావము వహించి చుట్టును బరిజనంబు బరివేష్టింపఁ గన్నీళ్ళచేఁ దుకూలము దడుపుచు నెడమచేతిపై మో మిడుకొని శయ్యపైఁ గూర్చుండి చింతించుచు భర్తరాకఁ దెలిసికొని ప్రత్యుదానాదివిధులం దీర్చినది.

అప్పుడా నరపతి యాసతీవతంసంబును దొడపై నిడుకొని కన్నీరు దుడుచుచు దేవీ! నీ వేమిటి కిట్లు ముక్తాఫలజాలంబులఁ బోనియశ్రుబిందుసందోహంబుల రెప్పల గుప్పుచుంటివి? కృశోదరీ! ఏమిటి కలంకరించుకొంటివి కావు? నీ విరక్తికిఁ గారణమేమి? నేను నీకెద్దియేని యనిష్టమైన పనిఁ గావించితినా చెప్పుము. నా జీవితము రాజ్యము నీ యధీనమై యున్నవి. వేగము విచారకారణం బెరింగింపు మని బ్రతిమాలుకొనియెను.

అప్పు డయ్యంబుజాక్షి తాంబూలకరండవాహిని మకరికయనునది మెల్లన నా భూవల్లభుని కిట్లనియె. దేవా! దేవర దేవిగారివిషయమై కొఱఁత యేమియుం జేసి యుండలేదు. వినుండు. నాకీమహారాజుతో సమాగమము విఫలమైనది గదా యని యమ్మగారు చింతించుచుండఁగనే చాలాకాలము గతించినది. శయనాసనస్నానభోజనభూషణపరిగ్రహాదులగు దివసవ్యాపారములఁ బరిజనప్రోత్సాహంబున నెట్టకే కష్టంబునఁ గావింపుచుండునది. అట్టి వికార మెన్నడును హృదయ పీడాజిహీర్షచేఁ దెలియనిచ్చినదికాదు. నేఁడు శివరాత్రియగుట మహాకాళనాథు నారాధింప దేవళమున కఱిగినది. అందొకచో మహాభారతము జదువుచుండఁ గొండొకసేపు కూర్చుండి యాలకించినది. అందు సుతులు లేనివారికి గతులు లేవనియుఁ బున్నామనరకము బుత్రులుగాని తప్పింపలేరనియు లోనగు వృత్తాంతము విని యింటికి వచ్చినదిమొద లావిషయమే ధ్యానించుచు మే మెంత బ్రతిమాలినను గుడువక కట్టక ప్రత్యుత్తర మీయక యిట్లు దుఃఖించుచున్నది. ఇదియే యీమె శోకకారణమని పలికి మకరిక యూరకొన్నది.

ఆ కథ విని యొడయం డొక్కింతతడవు ధ్యానించి వేడినిట్టూర్పు నిగుడింపుచు నిట్లనియె. దేవీ! యూరడిల్లుము. దైవాయత్తమగు కార్యమును గురించి మన మేమిచేయఁ గలము? దేవతలకు మనయెడ గనిగరము లేకపోయినది. వెనుకటిజన్మమున మంచికర్మ చేసితిమి కాము, ఇటుపిమ్మట మనుష్యులకు శక్యమైన పనులనెల్లఁ గావింతముగాక. గురుభక్తి నిబ్బడిగాఁ జేయుము. దేవిపూజలు విశేషముగాఁ గావింపుము. మునిజనసపర్యల నాదరముతోఁ జేయుము. వారు దుర్లభములైన వరముల నియఁగలరు. చండకౌశికప్రసాదంబున బృహద్రథుండు జరాసంధుండను పుత్రుం బడయలేదా? దశరథుండు వృద్ధుండయ్యు విభండకనందను నారాధించియే కాదా ! రామలక్ష్మణ భరతశత్రుఘ్నులను పుత్రులంగాంచెను. మునిజనసేవ యెన్నఁడును వ్యర్థముకాదు. మరి యిం