పుట:కాశీమజిలీకథలు-05.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

242

కాశీమజిలీకథలు - ఐదవభాగము

మీరును నిత్యానుష్టానములు దీర్చుకొని ఫలహారములఁ దృప్తులై రండు. రాత్రి సావకాశముగా నుడివెదనని పలుకగా వారందరు సంతసించి వడిగాఁ బోయి కాల్యకరణీయములం దీర్చుకొని తత్కథాశ్రవణకౌతూహలముతోఁ గ్రమ్మరం జనుదెంచి యమ్మహాముని సమక్షమందు యథానిర్దిష్టముగాఁ గూర్చుండిరి. అర్ధయామావశిష్టమగు రాత్రియందు సుధాకరకిరణములచే జగంబంతయు వెండిపూసినట్లు ప్రకాశింపుచుండ మలయమారుతములు మేనులకు హాయి సేయ హరీతకుఁడు మధురఫలరసంబుల నన్ను దృప్తుంజేసి మునులతోగూడ నతనియొద్దకుఁ దీసికొనిపోయి వేత్రాసనంబునం గూర్చుండి జలపాదుఁడను శిష్యుండు పవిత్రపాణియై మెల్లగాఁ దాళవృంతమున వీచుచుండ రెండవ పరమేష్టివలె నొప్పుచున్న యా జాబాలికి నమస్కరించి నన్నెదుర నిలిపి వినయంబున నిట్లనియె.

తండ్రీ! యీ మునులందరు నీ చిలుక వృత్తాంతము వినుటకు మిక్కిలి వేడుకపడుచున్నారు. ఇది తొలిజన్మమందెవ్వరు! ఎందుండునది? ఏమి కారణమున నిట్టి జన్మమెత్తినది? సవిస్తరముగా నుడువుఁడని యడిగిన నజ్జడదారి సంతసించుచు వారినందరను గలయఁ గనుంగొని యిట్లని చెప్పందొడంగె

తారాపీడుని కథ

క. కల దుజ్జయినీనగరం
   బిలను మహాకాళనామకేశ్వరలింగా
   మలదీప్తిదీపితాలయ
   కలితంబై చారుసౌధకమనీయంబై.

అవ్వీటి కధినాయకుండై తారాపీడుండను రాజు రాజ్యంబు సేయుచుండెను. అతడు నృగ, నల, నహుష, భరత, భగీరథ, ప్రభుతుఁలగు పూర్వనృపతుల నతిశయించిన కీర్తిగలవాఁడై నీతిశాస్త్రపారంగతుండును, ధర్మజ్ఞుండును యజ్ఞపూతవిగ్రహుండునునై రెండవ ధర్మదేవతవలెఁ బ్రజలం బాలింపుచుండెను.

అతనియొద్ద సకలకలానిపుణుఁ డగు శుకనాశుండను మంత్రి ముఖ్యుండు గలఁడు. అతఁడు బ్రాహ్మణుం డయ్యును, క్షాత్రంబున నత్యంతప్రసిద్ధిఁ జెంది యుండెను. చంద్రునకు వెన్నెలవలె నమ్మహారాజునకు నలంకారమై విలాసవతి యను విలాసినీలలామంబు మహిషీపదం బధిష్టించి యెక్కుడు మక్కువ గలుగఁజేయుచుండెను.

ఆ రాజు సప్తద్వీపముద్రితంబైన ధరావలయం బంతయు భుజబలంబున జయించి మంత్రిన్యస్తరాజ్యభారుండై యచ్చలరం బురడించు మచ్చెకంటులం గూడికొని గృహదీర్ఘికలయందును శృంగారసరోవరంబులయందును కేళికోద్యానములయందును