పుట:కాశీమజిలీకథలు-05.pdf/235

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

241

మానదు. మహాత్ముల నామము స్మరించినంత నెట్టి పాపములైనం బోవుననుచో దర్శనము వచ్చు సుకృతము మాట జెప్పనేల? సకలవిద్యలు నీ మహర్షి ముఖమున నటించుచున్నయవి. అన్నన్నా? ఈ ముదిమి కెంత భయములేదో! యా మహానుభావుని జటాకలాపమును సైతము తెలుపుజేసినది. తేజశ్శాలులలో నీతం డగ్రేసరుఁడు. ఈ మునికుంజరుఁడు కరుణారసప్రవాహము. సంసారసముద్రమునకు సేతువు. సంతోషామృతసారము, శాస్త్రరత్నములకు నికషపాషాణము, ఈ పుణ్యాత్ముని తపోమహిమచేతఁగదా! మృగములిందు జాతివైరము మాని సంచరింపుచున్నవి. అయ్యారే? మహాత్ముల ప్రభావము ఎంత విచిత్రమైనది. అని పెక్కు భంగుల నతని మహిమ నభినుతించుచున్న సమయంబున న న్నాహరీతకుఁడు రక్తాశోకతరుమూలమునకుం దీసికొనిపోయి యొకచోట నిలిపి తండ్రికి నమస్కరించి తానొక మూలఁ గూర్చుండెను.

అప్పుడచ్చటనున్న మునులు నన్నుఁ జూచి శంకించుచు దీని నెచ్చటనుండి తెచ్చితివని హరీతకు నడిగిన నతం డిట్లనియె.

నేను స్నానార్ధమై పద్మసరస్సునకుఁ బోవుచుండగా దారిలో నొకచెట్టుక్రింద నెండతాపమున వాడి దుమ్ములో నోరు దెరచుకొని యొగర్చుచు నీ శుకపోతము నాకుఁ గనంబడినది.

అప్పుడు నాకు దయపుట్టి దీనిని సరస్సునకుఁ దీసికొనిపోయి తోయము ద్రాగించి సేదదీరినంత నిచ్చటికిఁ దీసికొనివచ్చితిని. రెక్కలు వచ్చువరకు నిందొకతరుకోటరమున నిడి, నీవారకణనికరముల చేతను, వివిధఫలరసముల చేతను నేనును నీ మునికుమారులును దీనిం బోషించువారము. రెక్కలు వచ్చిన తక్షణము గగనతలమున కెగిరి యిష్టము వచ్చిన చోటికిఁ బోవునది. ఇదియే నా యభిప్రాయమని పలికిన విని జాబాలి యించుక వేడుకతోఁ దలయెత్తి పుణ్యజలములచేతఁ బవిత్రము చేయువాడుంబోలె నిర్మలమైన దృష్టులచే న న్నుపలక్షించుచు సారెసారెకు సాభిప్రాయముగా వితర్కించి నన్నుఁ జూచి తలయూచి తానుఁ జేసికొన్న యవినయమునకు ఫలం బనుభవించుచున్నాఁడని పలికెను.

తపఃప్రభావసంపన్నంబగు దివ్యదృష్టిచేత సకలప్రపంచమునంగల కాలత్రయవిశేషములు కరతలామలకముగాఁ జూడనోపిన యమ్మహానుభావుఁడట్లు పలికిన తోడనే యందున్న మునులందరు వెరగుపడి, మహాత్మా! ఇది పూర్వజన్మమందెవ్వరు? ఎట్టి యవినయకృత్యము జేసి యిట్టి జన్మమెత్తినది? దీని పేరేమి? ఈ వృత్తాంతము వినుటకు మిగులఁ గుతూహలముగా నున్నది, వివరింపవే! యని ప్రార్ధించిన నతండు మునులారా? దీని చరిత్రము కడువింతయైనది. మనకు స్నానసమయ మగుచున్నది.