పుట:కాశీమజిలీకథలు-05.pdf/234

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

240

కాశీమజిలీకథలు - ఐదవభాగము

నాతల్లి పోయినది మొదలు సకలక్లేశములు పడి నన్నుఁబెంచెనే? అట్టివాని ప్రేముడి యంతయు గడియలో మరచిపోయితిని. నా ప్రాణము లెంత కృపణములో? ఉపకారము జేసిన తండ్రి ననుగమించినవి కావు. ఇట్టి సమయములో సైతము నన్ను జలాభిలాష బాధింపుచున్నయది. పితృమరణమును లెక్క సేయని పాతకము నన్నిట్లు బాధింపుచున్నది కాబోలు అయ్యో! జలములు దాపునలేవు, నాలుక యెండిపోవుచున్నది. నడువలేను. వనభూమియంతయు నా తపముచే దప్తమైయున్నది. దాహమునకు నిమిషము తాళజాలను. చూపులకుం జీకటిగ్రమ్ముచున్నది. కటకటా! విధియెంత ఖలుఁడో నాకు వేగము మరణమైనను గలుగజేయకున్నాఁడని యనేకప్రకారములఁ దలపోయుచుంటిని.

ఆ ప్రాంతమందు జాబాలియను మహర్షి యాశ్రమముగలదు. అతని కుమారుఁడు హరీతకుండను వాఁడు సకలవిద్యాపారంగతుండు. సమవయస్కులగు మునికుమారులతోఁ గూడుకొని రెండవ మార్తాండునివలెఁ దపస్తేజంబున వెలుంగుచు నమ్మార్గంబున స్నానార్ధమై పంపాసరస్సునకుఁ బోవుచు దాహపీడితుఁడనై నోరు తెరచుకొని దారిలో నొగర్బుఁచు బడియున్న నన్నుఁ జూచెను.

సత్పురుషుల హృదయములు కరుణాబంధురములు గదా! అట్టి యవస్థతో నున్న నన్నుఁజూచి యమ్మహాత్ముం డంతరంగంబునఁ బరితపించుచుఁ దోడి మునికుమారునితో వయస్యా! అటు చూడుము! ఆ శుకపోతము అజాతప్రతమై తల వాల వైచుకొని యున్నది. శ్యేనాదికము దీనిం బాధింపఁబోలు. దీని ప్రాణములు కంఠగతములై యున్నవి. నీటికొరకుఁ గాబోలు మాటిమాటికి నొగర్చుచు నోరు దెరచుచున్నది. పాపము దీని ప్రాణములు వాయకమున్న జలప్రదేశమును జేర్పుదము లెమ్ము. దీని ప్రాణములు కాపాడిన కడుపుణ్యము రాగలదని పలుకుచు మెల్లన నన్ను మృదులమగు హస్తములతోఁ బట్టికొని యా సరస్స్తీరము జేర్చి దండకమండలము లొకచోటంబెట్టి యతిప్రయత్నముతో ముక్తాఫలంబులంలోని జలబిందువులఁ గొన్నిటి నా నోటం బోసెను.

అప్పుడు నా మేనంతయుఁ జల్లబడినది. పోయిన ప్రాణములు తిరిగి వచ్చినవి. శరీరమున ధారుడ్యము గలిగినది. పిమ్మట న న్నొకచెట్టునీడ నిలిపి తాను స్నానము గావించి నిర్వర్తితనిత్యక్రియాకలాపుండై యమ్మునికుమారుండు మిత్రవర్గముతో జలము వెడలి నన్నొకచేత బట్టికొని తన యాశ్రమమునకుఁ బోయెను.

అధికమహిమాస్పదంబగు నయ్యాశ్రమమున గురుతరయోగనిష్టాగరిష్టుండై యున్న జాబాలిం జూచి నే నంతర్గతంబున నిట్లు తలంచితిని.

ఆహా తపఃప్రభావము! ఈ మునిమార్తాండుని యాకారము శాంతమయ్యు మెరుపుతీగెయుఁబోలెఁ జూట్కులకు మిరుమిట్లు గొలుపుచున్నయది. ఇమ్మహర్షి యుదాసీనుం డైనను ప్రభావసంపన్నుఁడగుట మొదటఁ జూచినవానికి వెరపు గలుగక