పుట:కాశీమజిలీకథలు-05.pdf/233

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

239

హరమునగు నుపద్రవమునుజూచి మరణభయంబున మేను గంపమునొంద నుద్ర్భాంతదృష్టులతో నలుమూలలు సూచుచుఁ దాలువులెండ నన్ను రక్షించు నుపాయంబుగానక తన రెక్కలసందున నిముడ్చుకొనిఁ గర్తవ్యతామూఢుండై ముక్కునఁ గరచుకొని యుండెను.

పిమ్మట నప్పాపాత్ముఁడు క్రమమ్మునఁ గొమ్మలపై కెక్కి మేమున్న తొర్రలో యమదండమునుంబోలు తన బాహుదండమును జొనిపి సారెకు ముక్కుకొనచేఁ గరచుచు నరచుచున్న మా తండ్రిని గట్టిగఁబట్టి పైకిఁదీసి గొంతునులిమి ప్రాణములు బోఁగొట్టెను.

మిగుల నల్పదేహము గలిగి భయముచేఁ దండ్రి రెక్కలసందున నడఁగియున్న నన్ను నాఁడాయుశ్శేషము గలుగఁబట్టి బరిశీలింపడయ్యెను.

ప్రాణములు విడచి తలవ్రాలవైచిన నా తండ్రిని యానిర్దయుండు అధోముఖముగా నేలంబడవిడచెను. నేనును మాతండ్రితోఁగూడ నేలం బడితినికాని దైవవశంబున జేసి రాశిగానున్న యాకులపై బడుటచే నా కింతయేని యాయాసము గలిగినదికాదు.

అక్కిరాతుండు చెట్టుదిగకమున్న నేను బాలుండనగుట దండ్రిచావు గణింపక ప్రాణపరిత్యాగయోగ్యమగు కాలంబున సైత మించుక ఱెక్కలు విదళించుచుఁ గొంచెము కొంచె మెగిరి కృతాంతముఖకుహరమునుండి వెల్వడినట్లు నాతిదూరములో నున్న యొకతమాలవిటపిం గాంచి దట్టమైన యా చెట్టు మొదలుచేరి పక్షసవర్ణములగు పర్ణములసందున దాగియుంటిని.

అక్కిరాతుఁడు గ్రమముగా నా చెట్టునంగల పిట్టల నెల్లఁబట్టి చెట్టుదిగి యసువులూడి క్రిందఁబడియున్న చిలుక నిసువులను జిక్కములోఁ బెట్టుకొని మాతంగుఁ డరిగిన తెరవుబట్టి యతివేగముగాఁ బోయెను.

తరువాత నేనించుక తలయెత్తిచూచుచు నాకు కదలినను వాఁడే వచ్చుచున్న వాఁడని బెదరుచు పితృమరణశోకఖిన్నుఁడనై మిగుల దాహమగుచుండ నీరుండుతా వరయుచు నామూలమునుండి యెగర దొడంగితిని. ఱెక్కలతో నెగరలేక పాదములతో నడచుచు ననభ్యాసంబునం జేసి యడుగడుగునకు నేలఁబడుచు నెగరబోయి యడ్డముగా బడి యొంటిఱెక్కతో నానుచు నొగర్చుచు మేనెల్ల ధూళిగాఁగఁ నిట్లాయాసముతోఁ గొంచెము దూరమైనను నడువలేక మిక్కిలి దాహము వేధింప మనంబున నిట్లు తలంచితిని.

ఆహా? అతి కష్టములైన యవస్థలయందుగూడఁ బ్రాణులకు జీవితమందు నిరపేక్షత్వము గలుగదుకదా? జంతువులకు జీవితముకన్న నభిమతమైన వస్తువు వేరొండులేదు. నా యందు మిగుల ననురాగముగల తండ్రి పరలోకగతుండైనను నాకు జీవితాశ వదలకున్నది. కటకటా! నా హృదయమెంత కఠినమైనదో? అతండు