పుట:కాశీమజిలీకథలు-05.pdf/232

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

కాశీమజిలీకథలు - ఐదవభాగము

నిండింపుచు నెఱ్ఱనిదృష్టులు వింధ్యశిలాతలవిశాలంబగు నురంబును మెఱయ స్థూలవరాటికామాలికలచే నలంకరింపంబడి పతులం జంపవలదని తన్నుఁ బ్రతిమాలికొన వచ్చిన యాఁడుసింగంబులోయనఁ గౌలేయకుటుంబిను లనుసరించిరాఁ జమరీవాలంబులు గజదంతంబులు కరిగండముక్తాఫలంబులు మయూరపింఛంబులు పిసితాహిరంబులుగైకొని శబరపరిజనులు వెంటనడువఁ గృతాంతుని యంశావతారమన మహామోహిని సోదరునివలె నొప్పుచుఁ బ్రథమవయసుననున్న మాతంగుడను పుళిందనాథుం గాంచితిని, వారాడుకొను మాటలు వినుటచే వాని పేరు మాతంగుఁడని యెఱింగితిని.

ఆహా! వీని జీవితము మోహప్రాయము. చరితము సాధుజనగర్హితము. ఆహారము మద్యమాంసాదికము. పరిశ్రమయంతయు జీవహింసయంద, త్రాగుటయే యుత్సవము, చెరబట్టిన యుత్తమస్త్రీలే కళత్రములు, మృగములతో సహవాసము, పశురక్తంబున దేవతార్చనము, మాంసమున బలికర్మ ఇట్టి వీనికిఁ గరుణ యెట్లు కలుగును. శాంతి పేరైనం దెలియునా? క్షమ కెంతదూరము. వీనికి వివేక మెన్నఁడైనఁ గలుగు నేమో! యని నే నాలోచించుచుండఁగనే యమ్మాతంగుఁ డరణ్యసంచారప్రయాస మపనయించుకొనుటకై యా బూరుగునీడ కరుదెంచి కోదండ మెక్కు డించి పరిజనోపనీతంబగు పల్లవాసననంబునఁ గూరుచుండెను.

అప్పుడు శబరయువకుఁ డొకండు వడివడి నాసరోవరంబున కరిగి చేతులతో జలంబుపైనున్న మలినంబు విడఁద్రోయుచుఁ గమలినీపత్రపుటంబున నీరువట్టి బిసతంతువులఁ గొన్నిటిని కోసికొనివచ్చి యాయేలిక కర్పించెను. వాఁడా జలంబులం గ్రోలి చంద్రకిరణంబులం గ్రసియించు రాహువువలెఁ దామరతూడుల నమలి క్షుత్పిపాసల నపనయించుకొనియెను. వాఁడట్లు మాచెట్టునీడఁ గొంతసేపు విశ్రమించి పిమ్మట పుళిందసేనాపరివృతుండై యెందేనింబోయెను.

వారిలో నొక వృద్ధపుళిందుఁడు తినుటకు మాంస మబ్బమింజేసి యాఁకలి గొని వారితోఁబోవక యత్తరుమూలమున ముహూర్తకాలము జాగుజేసి మా యాయువుల గ్రోలువాడువలె నెఱ్ఱనిగుడ్లుగల దృష్టులతో నా వృక్షమెక్క నిశ్చయించి యామూల చూడముగాఁ దలపైకెత్తి చూచెను.

ఆ చూపువలననే శుకకులముల ప్రాణముల కుత్క్రాంత సమయమైనది. కటకటా! అక్కటికము లేనివారికిఁ జేయరాని కృత్యము లుండునా? అనేక తాళోఛ్రాయముగల యాపాదపమును సోపానములు గలదానివలె సులభముగానెక్కి యెగిరీ యెగరని పిల్లలను, ఎగరనున్న నిసువులను, గొన్ని దినములక్రిందటఁ బుట్టిన పిట్టలను, రెక్కలు వచ్చుచున్న కూనలను శాల్మలీకుసుమ శంకాజనకములగు పోతముల నరసి యరసి శాఖాసందులనుండియు, గోటరములనుండియు, వేరువేరుఫలములనువలె పెక్కురకముల శుకశాబకముల గ్రహించి ప్రాణములను పోగొట్టి నేలం బడవైచుచుండెను.

అప్పుడు మాతండ్రియు నకాండమునఁ దటస్థించిన యప్రతీకారము ప్రాణ