పుట:కాశీమజిలీకథలు-05.pdf/230

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

236

కాశీమజిలీకథలు - ఐదవభాగము

జలంబులం గ్రోలి యిటునటు సంచరించుచుఁ బక్షులవలె శాఖాంతరములయం దణఁగియున్న మేఘంబులచేతఁగూడ నావరింపబడని యగ్రభాగము గలదై రవితురంగముల కవరోధము గలుగఁజేయుటచే నలయిక జెందిన యవ్వారువంబులముఖములనుండి వెల్వడుఁ ఫేనపుంజమో యనఁబడు సితతూలికామాలికలచే నగ్రశాఖలు బ్రకాశింప నాకల్పస్థాయియగు నున్నతస్కంధముతో నొప్పుచు నబ్బూరుగు మేరువువలెఁ ప్రఖ్యాతి జెందియున్నది.

మఱియు నత్తరుపు విస్రబ్ధముగా జనుల కారోహింప శక్యము కానిదగుట ఘాతుకులవలనఁ దమ కపాయము రాదని తలంచి శాఖాంతరముల యందునుఁ గోటరోదరములయందునుఁ బల్లవాంతరములయందును జీర్ణవల్కలవివరములయందును మిగులనవకాశము గలిగియుండుటచేత నానాదేశములనుండి వచ్చి శుకసంతతులు గూడులు కట్టుకొని హాయిగా సుఖించుచున్నయవి.

అందొక జీర్ణకోటరమందు జాతిపులుగులతోపాటు కులాయము నిర్మించుకొని భార్యతోఁ గూడ మాతండ్రి చిరకాలము సుఖించెను. విధివశంబున నతనికి ముదిమియందు నేనొక్కరుండ పుత్రుండ నుదయించితిని. నేను బుట్టిన యాక్షణము నందే యతిప్రబలమగు ప్రసవరోగంబున మా తల్లి పరలోకమున కతిథిగా నఱిగినది.

అభిమతజాయావినాశశోకంబున స్రుక్కుచుండియు మా తండ్రి సుతస్నేహంబున నాశోక మడచికొని తానొక్కరుండ యేకొరంతయు రానీయకుండ నన్నుఁ బెనుచుచుండెను.

నా తండ్రి మిగులవృద్ధు డగుట శిథిలములగు రెక్కలతో నెగరలేక వణకుచు స్రుక్కినముక్కుకొనచేత ఫలములజీర నశక్తుండై పరనీడములక్రింద నక్కడక్కడ జారిపడిన ఫలశకలంబులును తండులకణంబులును దెచ్చి నా కిచ్చుచు మద్భుక్తావశిష్టములచేఁ దాను సైత మాకలియడంచుకొనుచుఁ కొన్నిదినములు గడిపెను.

ఇట్లుండ నొకనాఁడు ప్రాతఃకాలమున లేతయెండచే వనతరుశిఖరపల్లవంబులు వింతకాంతిఁ బ్రకాశింపుచుండ గొన్నిచిలుకలు మేతకై దిక్కుల కరుగ, మరికొన్ని పిల్లలతో గూడ గూడులయం దణఁగియుండ నిశ్శబ్దంగా నవ్వవస్పతి శూన్యమైనదివోలె నొప్పుచుండెను.

అప్పుడు నా తండ్రియు నన్ను రెక్కలలోఁ బెట్టుకొని ముద్దాడుచుండ నేనును బాల్యంబున నెగురటకు రెక్కలు రామింజేసి యతని యక్కులోఁ జిక్కి మిక్కిలి సంతోషముతో నుంటిని. అట్టి సమయమున నవ్వనమందు నాకస్మికముగా గుహాసుప్తంబులగు మృగేంద్రంబులు దద్దరిల్ల వనచరంబులు పరవ వరాహంబు లార్వ శార్దూలాదిక్రూరమృగసమూహంబు వెరబునం బార గంగాప్రవాహంబు ననుకరించుచు

సీ. ఇటు రండు గజము లిచ్చటనుండు తుండ వి
           ధ్వస్తపంకేజగంధంబు వెడలె