పుట:కాశీమజిలీకథలు-05.pdf/229

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

235

నిర్వర్తించుకొని రాజబంధువులతో గూడ నభిమతరస్వాదంబున బ్రీతుండగుచు భోజనము గావించి ప్రతీహారి మార్గ మెరింగింప మనోహరాలంకారమండితంబైన విశ్రమమంటపమునకుఁబోయి శయనతలంబునఁ గూర్చుండి తాంబూలము వైచికొనుచు నాప్తవర్గంబు చుట్టునుం బరివేష్టించి వినోదకథలచే చిత్తము రంజింపఁజేయుచుండ నిండువేడుకలతో నుండి యాభూమండలాఖండలుఁడు వైశంపాయనమును దీసికొనిరమ్మని బ్రతిహారి కాజ్ఞాపించుటయు నదివోయి యత్యంతశీఘ్రముగా నా జిలుకపంజరము దెచ్చి రాజు మ్రోలబెట్టెను. అప్పుడా భూపతి చిలుకంజూచి పతంగపుంగవా! అభిమతభోజనంబున దృప్తుడవైతివే? యని యడిగిన నది దేవా! సమదకోకిలలోచనరుచిం బురడించు జంబూఫలంబు లెన్నేని యాస్వాదించితిని. హరినఖరభిన్నమాతంగకుంభార్ద్రంబులగు ముక్తాఫలంబులం బోలిన దాడిమీబీజంబుల రుచి యేమనవచ్చును? అన్నన్నా! నళినీదళంబులువోలె హరితములగు ద్రాక్షఫలముల మాధుర్య మెప్పటికైన మరువవచ్చునా? అయ్యారే! ప్రాచీనములగు నుసిరికాయల పస యనుభవించి తీరవలయును. పెక్కేల! భవదంతఃపురకాంతలు స్వయముగాఁ గరతలములచే నాకుఁ దినిపించినవన్నియు నమృతాయమానంబులై యున్నవని పెద్దగాఁ బొగడెను.

ఆ మాట లాక్షేపించుచు నా క్షితిపతి పక్షీంద్రమా! యది యట్లుండనిమ్ము. నీ వేదేశమునం జనించితివి? నీ తలిదండ్రు లెవ్వరు? నీకు వేదశాస్త్రపరిచయ మెట్లు గలిగినది? ఇతర విద్యావిశేషము లెట్లు గ్రహించితివి? జన్మాంతరానుస్మరణమా! లేక వరప్రదానమా? అదియునుం గాక శుకరూపము దాల్చి ప్రచ్ఛన్నముగాఁ దిరుగుచున్న యొకానొకదివ్యుఁడవా? నీకెన్ని యేండ్లున్నవి? యింతకుముందు నీ వెందుంటివి?

నీ కీపంజరబంధము చండాలకన్యకాహస్తప్రాప్తియు నెట్లు కలిగినది? నీ వృత్తాంతము విన మిక్కిలి కుతూహలమగుచున్నది. యెఱింగించెదవే యని యడిగిన నాపతంగప్రవర మాత్మగతంబున నించుక ధ్యానించి యిట్లనియె.

చిలుక కథ

దేవా! నాయుదంతము కడు పెద్దది. వినుటకు దేవర కిష్టమేని వక్కాణించెద నాకర్ణింపుఁడు. వింధ్యారణ్యాంతర్భాగంబగు దండకారణ్యమునఁ బ్రసిద్ధిజెంది యున్న పంచవటితీరమునఁ కనతిదూరములో నున్న పంపాసరోవరము పశ్చిమభాగంబున శ్రీరామశరప్రభంజితములగు సప్తతాళములప్రక్క నొక్కవృద్ధశాల్మలీవృక్షము గలదు.

అత్తరువరంబు మూలంబు దిక్కిరి కరంబులఁబోని జరదజగరంబుచేఁ జుట్టుకొనఁబడి యాలవాలము గట్టఁబడినట్టొప్పుచు శాఖాసమూహములచేఁ దిగంతముల నావరించి విలయవేళాతాండవప్రసారితభుజుండగు శంకరు ననుకరించుచు సాగర