పుట:కాశీమజిలీకథలు-05.pdf/228

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

234

కాశీమజిలీకథలు - ఐదవభాగము

దయతోఁ బరిగ్రహింపుఁడని పలుకుచు నాపంజర మానృపకుంజరుని ముందర నిడి యా వృద్ధుం డించుక యెడముగాఁ బోయెను.

అప్పు డప్పతంగపుంగవము రాజాభిముఖముగా నిలువంబడి కుడిచరణ మెత్తి మిక్కిలి స్పష్టములగు వర్ణస్వరములచే సంస్కరింపఁబడిన వాక్కులతో జయశబ్దపూర్వకముగా నీపద్యముఁ[1] జదివినది.

గీ. అనఘ! భవదరి నృపవధూస్తనయుగంబు
    చిత్తగతశోకదహనంబుచెంత నిలిచి
    యశ్రుజలపూరమునఁ దీర్ధమాడి మరి వి
    గతమహాహారమై వ్రతిస్థితి దనర్చు.

ఆ చిలుక పలుకులు విని యానృపతిలకుండు వెఱఁగు జెందుచు సంతసముతోఁ జెంతనున్న కుమారపాలితుండను వృద్ధమంత్రిం జూచి, ఆర్యా! యా చిలుక పలుకులయందలి స్పష్టతయు మాధుర్యమును వింటివా? ఇది వర్ణమాత్రానుస్వారస్వరసంకరము గాకుండ నభివ్యక్తముగాఁ బలుకుటయే మొదటిఁ జిత్రము. మఱియు మనుజుండువోలె బుద్ధిపూర్వకమగు ప్రవృత్తితో నభిమతవిషయమై కుడిచరణమెత్తి జయశబ్ద పూర్వకముగా నతిపరిస్ఫుటాక్షరముగా పద్యము జదువుట గడుంగడు నబ్బురము గలుగఁజేయుచున్నది తరుచు పక్షులును, బశువులును నిద్రాహారమైథునభయసంజ్ఞామాత్రవేదులు గదా?

అని పలుకుటయు గుమారపాలితుఁ డించుక నవ్వుచు, దేవా! ఇది యేమి చిత్రము. శుకశారికాప్రభృతివిహంగమువిశేషములు మనుష్యులచేఁ చెప్పబడిన మాటలం బల్కుచుండుట దేవర యెరుంగనిదియా? పూర్వము చిలుకలు మనుజులువలె బలుకుచుండునవి అగ్ని శాపంబునం జేసి శుకవచనము లపరిస్ఫుటములైనవి.

అని యతండు సమాధానము జెప్పుచుండఁగనే చండకిరణుం డంబరతలమధ్యవర్తి యయ్యెనని తెలుపు భేరీనినాదముతోఁ గూడ మాధ్యాహ్నికశంఖధ్వని బయలువెడలినది.

ఆ ధ్వని విని యమ్మహారాజు స్నానసమయమయ్యెనని తటాలున సింహాసనము నుండి లేచి రాజలోకమెల్ల సంభ్రమోత్సేకముతో గద్దియలు విడిచి వినయవినమితోత్తమాంగులై నిలువంబడిన శిరఃకంపమున వారికిఁ బోవుట కనుజ్ఞ నిచ్చుచు నచ్చండాలకన్యకతో మేము వచ్చు నందాక నిందుండుమని నియమించి యచ్చిలుకను లోపలకుఁ దీసికొనిపోయి స్నానపానాశనాదివిధులం దీర్పుమని తాంబులకరండవాహినికిం జెప్పి సముచితమిత్రలోకము సేవింప నభ్యంతరమందిరమున కరిగెను.

అందు స్నానసంధ్యావందనదేవపూజాది నిత్యక్రియాకలాపములు

  1. శ్లో॥స్తనయుగమశ్రుస్నాతం సమీపతరవర్తిహృదయాశోహాగ్నేః॥