పుట:కాశీమజిలీకథలు-05.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాదంబరి

233

రచింపఁబడినను జిలుకరెక్కలకాంతులచే మరకతమయమైనదివోలెఁ బచ్చపడియున్న పంజరమును జేతంబూని కాకపక్షంబులు చలింప నొకచండాలబాలకుఁడు తోడరా నసురాపహృతంబగు నమృతంబు వేల్పులకిడ నవధరించిన మధుసూదనుని మోహినీరూపమును బురడించు మీగాళ్ళదనుక మేలిముసుగు వైచికొనుటచే సంచరించు నింద్రనీలపుబొమ్మవలె నొప్పుచు సంతతము వెన్నుని యురమందు వసించుటఁ దదీయశ్యామప్రభాసంక్రమణంబున నల్లబడిన మహాలక్ష్మియుం బోలె బలరాముని హలాపకర్షణభయంబునఁ బారివచ్చిన యమునచాడ్పునఁ గుపితహరనయనదహ్యమానుండగు మదనుని ధూమమున మలినీకృతయగు రతి ననుకరించుచు నచిరోపారూఢయౌవనయై వచ్చుచున్న యామాతంగకన్యక నిముషలోచనుండై యా రాజమహేంద్రు డీక్షించి విస్మయావేశితహృదయుఁడై యిట్లు తలంచెను.

అన్నన్నా! తగనిచోట హాటకగర్భున కక్కజమగు రూపుగల్పించు ప్రయత్న మేమిటికిఁ గలుగవలయును. అక్కటా! నిరతిశయసౌందర్యవిశేషంబునం బొలుపొందు నియ్యిందువదనను ముట్టరాని నికృష్టకులంబునం బుట్టించెగదా! మాతంగజాతి స్పర్శభయంబున స్రష్ట ముట్టకయే యిప్పూబోణిని నిర్మించెనని తలంచెదను. కానిచోట దదీయకరతలస్పర్శక్లేశితములగు నంగముల కింత వింతకాంతియు లావణ్యము గలిగియుండునా? ఇసిరో! సరసిజభవుం డెప్పుడు నసదృశసంయోగమునే చేయుచుండును గదా? అతిమనోహరాకృతిగల యీనాతి క్రూరజాతియం దుదయించుటచే నిందితసురతయై యసురసంపదవలె నభోగ్యమై యున్నదని నాడెందము మిక్కిలి పరితాపము జెందుచున్నది.

అని యతఁడు తలంచుచుండ నక్కన్యారత్నము మ్రోలకువచ్చి యించుక వంగి ప్రోడవలె నమస్కరించి యమ్మణికుట్టిమంబున నోరగా గూరుచున్నంత నావృద్ధమాతంగుఁడు పంజరములో నుండగనే చిలుకను చేతితో నంటి సవరించుచు గొంచెము దాపునకువచ్చి ఱేనికిం జూపుచు నిట్లనియె. దేవా! యీ చిలుక సకలశాస్త్రార్ధములు గుర్తెరుంగును. రాజనీతియందును పురాణకథాలాపమునందును దీనికి మంచినైపుణ్యము గలదు. కావ్యనాటకాలంకారగ్రంథములు జదువుటయేకాక స్వయముగా రచింపఁగలదు. వీణావేణుమురజప్రభృతివాద్యవిశేషములసార మిదియే చెప్పవలయును. చిత్రకర్మయందు ద్యూతవ్యాపారమునందును గజతురగస్త్రీలక్షణజ్ఞానమందును దీనిని మించినవారు లేరు. ప్రణయకలహకుపితులగు కాముకులం దేర్చు నేర్పు దీనికే కలదు. పెక్కులేల? యాపతత్రిప్రవరంబు సకలభూతలరత్నభూతమని చెప్పునొప్పును దీని పేరు వైశంపాయనము. సర్వరత్నములకు జలనిధివోలె దేవర ముఖ్యభాజనమని తలంచి మా భర్తృదారిక యీ చిలుకను మీపాదమూలమునకుఁ దీసికొనివచ్చినది. దీనిం