పుట:కాశీమజిలీకథలు-05.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

232

కాశీమజిలీకథలు - ఐదవభాగము

సీ. అతులస్వరంబు లుప్పతిలంగ వీణ గై
          కొనిపాడు హాయిగాఁ గొంతసేపు
    మహితప్రబంధనిర్మాణక్రియారత
          స్వాంతుఁడై యలరారుఁ గొంతసేపు
    దర్శనాగతతపోధనజనారాధనా
          కుతుకాత్ముఁడై యుండుఁ గొంతసేపు
    చర్చించు సకలశాస్త్రప్రసంగంబులఁ
          గోవిదావళిఁ గూడి కొంతసేపు

గీ. కోర్కె చిత్తరువులు వ్రాయుఁ గొంతసేపు
    గురుపురాణము లాలించుఁ గొంతసేపు
    జంతుసంతతి నాడించుఁ గొంతసేపు
    అంగనాభోగవిముఖుఁడై యనుదినంబు.

మిగుల సుందరుండగు నా నృపనందనుండు ప్రథమవయస్సున స్త్రీజనమును దృణముగాఁ జూచుచు సంతానార్ధులగు మంత్రులచే బోధింపఁబడియు సురతసుఖంబునందలి విరోధంబునంబోలె దారసంగ్రహం బనుమతింపఁడయ్యెను.

ఒకనాఁడు ప్రొద్దుట నప్పుడమిరే డాస్థానమంటప మలంకరించియున్న సమయంబున నంగనాజనవిరుద్ధముగ వామకక్షమునఁ గౌక్షేయక మిడికొని సన్నిహితపన్నగంబగు చందనలతవోలె భీషణరమణీయమగు నాకారముతో బ్రతీహారి యరుదెంచి జానుకరకమలంబులు పుడమిసోక మ్రొక్కుచు నిట్లనియె.

దేవా! కుపితుండగు దేవేంద్రుని హుంకారంబున నేలంబడిన త్రిశంకుని రాజ్యలక్ష్మియో యన దక్షిణదేశమునుండి మాతంగకన్యక యోర్తు పంజరముతో నొకచిలుకను దీసికొనివచ్చి ద్వారదేశమునఁ నిలువంబడి దేవరతో నిట్లు విజ్ఞాపన చేయుచున్నది. భువనతలంబునగల రత్నములకెల్లఁ గల్లోలినీవల్లభుండు వోలె దేవరయే యేకభాజనమని తలంచి యాశ్చర్యభూతమగు నీ విహంగమరత్నము నేలికపాదమూలమును జేర్చు తలంపుతో నరుదెంచితిని. దర్శనసుఖం బనుభవింపఁ గోరుచున్నదాన.

అని తత్సందేశ మెరింగించిన ప్రతీహారి వచనంబులు విని యా భూనేత కుతూహలోపేతుఁడై యాసన్నవర్తులగు మిత్రులమోములు పలక్షించుచు దీనందప్పేమి యున్నది, ప్రవేశపెట్టుడని యాజ్ఞాపించుటయు నా ప్రతీహారి సత్వరము యరిగి యమ్మాతంగకుమారిం దీసికొని వచ్చినది.

ముదిమిచేఁ బండిన శిరము గలిగి నేత్రకోణము లెఱ్ఱనిజీరలతో నొప్పుచుండ జవ్వన ముడిగినను బరిశ్రమ గలుగుటచే శిథిలము కాని నేమే బింకముతోఁ దెల్లని వస్త్రములు ధరించి వృద్ధమాతంగుఁ డొకఁడు ముందు నడచుచుండఁ బైడిశలాకలచే