పుట:కాశీమజిలీకథలు-05.pdf/222

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

228

కాశీమజిలీకథలు - ఐదవభాగము

అయ్యో ! మండనుఁడు యతిమార్గనిరోధకుండై సన్యాసులు తమ యింటికి వత్తురను భయముతో సర్వదా తలుపులు వైచికొని గూఢముగా నున్నవాఁడు. వాని యింటి ప్రహరి మిక్కిలి యెత్తుగా నున్నది. లోపలఁ ప్రవేశించుట యెట్లో తెలియదు. సాధన మేమియుం దోచుకున్నదని విచారింపుచున్న సమయంబున నొకచోట నొక యీడిగవాఁ డొక యీతచెట్టు కట్టెదుర నిలువంబడి యేదియో యుచ్చరించెను. అప్పుడా మ్రాను వాని పాదంబులకు నమస్క రింపుచున్నదో యనునట్లు శిరము నేలంట వంగినది. తరువాత నీడిగవాఁడంతకుముందు దానందు దగిలించియుంచిన కుండలలోని కల్లు దీసికొని వెండియు నా ఘటంబుల వాని గెలలకు దగిలించి మరల నేదియో యుచ్చరించెను.

అప్పుడా యీతమ్రాను రివ్వునఁబోయి యధాప్రకారము నిలచినది. ఆ యీడిగవాఁడందున్న యీతచెట్లకల్లా ఆ ప్రకారము గీచుచుండెను. ఆ వింతఁ గన్నులారఁజూచి శ్రీ శంకరాచార్యులు మిగుల వెరగుపడుచు, నోహో ! యీశ్వరసృష్టిలో నెన్ని విశేషములైనం గలవుగదా ! నాకు వీనివలన నీ విద్య సంగ్రహించుట కర్జము. ఈ విద్య నాకు లభించెనేని మండనమిశ్రు నింటిలోఁ బ్రవేశించుట సులభమని తలంచుచు వాని దాపునకుబోయి మన్నించుచు నిట్లనియె. ఓరీ ! నీ పేరేమి? నీ కాపురం బెచ్చట ? నీవీ విద్య యెవ్వని వలన సంపాదించితివి. నిన్నుఁజూడ నాకు మిగుల సంతసముగా నున్నది. నీ వృత్తాంతము కొంతఁ జెప్పుమని యడిగిన వాఁడు నమస్కరింపుచు యతీంద్రున కిట్లనియె.

స్వామీ! మండన పండిత పుండరీక మండితంబైన మాహిష్మతీపురము నా కాపురము. మేమీడిగవాండ్రము. నాకీవిద్య మా తండ్రియే యెఱింగించెను. మేమిట్లు చేయుచున్న విషయమై లోకులెవ్వరు గ్రహింపలేరు. మీరు దెలిసికొంటిరి. దీన మీరు మహానుభావులని తెల్లమగుచున్నదని వాఁడయ్యాచార్యవర్యు ననేక ప్రకారముల స్తుతి యించెను.

అప్పుడు శంకరులు ఓరీ! నీకీవిద్యవలన శ్రమ కొరంతపడుట తప్ప వేరొక లాభమేదియును లేదుగదా? నీవు నాకీవిద్వ నెఱింగింపుము. నీకు నేను బంగార మయ్యెడి యోగ మెరింగించెద. దాన నీకు విశేషలాభము కాఁగలదని పలుకుటయు నయ్యీడిగవాఁడు మిగుల సంతసించుచు నిట్లనియె.

మహాత్మా! యీవిద్య పుత్రులకుఁగాక యితరుల కెరిగింపరాదని మాతండ్రి నాకుపదేశించునప్పుడు నావలన ప్రమాణికము జేయించుకొనెను. ఈవిద్య నే మీకిచ్చితినేని నిక మా కులమున నిలువదుగదా ? మీరిచ్చు విద్యవలనఁ గులవృత్తితో బనిలేనంత భాగ్యము గలిగెనేని మీకీవిద్య నిచ్చెద లేనిచో రెంటికిం జెడినఁవాడనగుదును. మరియు మిగుల విలువఁగల విద్యనిచ్చి నల్పవిద్య నావలనం గ్రహించిన మీకేమి లాభము? విచారించుకొని దయచేయుఁడని పలికెను. అప్పుడు శంకరులు వాని మాటలకు మెచ్చు