పుట:కాశీమజిలీకథలు-05.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

227

అప్పుడు వారు తదీయపాదంబులంబడి, తల్లీ ! మేమెరుంగక మేమే లోక ప్రధానులమని గర్వించి జగత్పీడఁ గావించితిమి. బుద్ధి వచ్చినది. యీ తప్పు సైరింపుము. పుత్రుల నేరములు తల్లి లెక్కింపదుగదా. రక్షింపుము. రక్షింపుము. మత్కోపగారణంబునంజేసి భవదీయపాద దర్శనం బైనది. ఇదియే యిందులకు ఫలమనియు మురిచుయున్నవారమని యనేక ప్రకారములు స్తోత్రములు చేయుచు నీవింతకాలముదనుక మాకు దర్శనంబిచ్చితివికావేమి యెరింగింపుమని యడగిన ప్రసన్నయై యమ్మహాదేవి యిట్లనియె.

బిడ్డలారా ! మీ వంటివారు కోటానకోటులు నా పాలనములో నున్నారు. అవసరము వచ్చినప్పుడుగాని నే నెవ్వరికిం గనంబడను. నా యునికి యెవ్వరు నెరుంగరు. మీరిప్పు డన్యోన్యము బద్దమత్సరులై స్వాతిశయబుద్ధితో నియతవ్యాపారముల మానిరని తెలిసి మందలించుటకై రప్పించితి. నింక నెప్పుడు నిట్టి పెడత్రోవలకుం బోకుఁడు. కాలానుసరణముగా వర్తించుఁడు. పొండని యమ్మహాదేవి యానతిచ్చి యంతర్ధాన మొందినది.

పదంపడి త్రిమూర్తులును దేవీప్రభావము వేతెరంగులఁ గొనియాడుచుఁ దత్ప్రసాదలబ్ద సమధిక ప్రభావ సంపన్నులై తృటికాలములోఁ దమ నెలవులంజేరి గర్మవిముక్తులై యథాపూర్వకముగా లోకపాలనము గావింపుచుండిరి.

శంకరా ! అట్టి యాదిశ క్తి ప్రభావ మెరుంగక నీవు శక్తిలేదని వచించితివి. లోకాతీతమగు నీ ప్రవృత్తి నెరుఁగుటంబట్టి నీకు బోధింప నరుదెంచితిని. అమ్మహా శక్తిని నన్నుగా భావింపుము. ఏమరక పూజింపుమని బోధించిన సంతసించుచు నాచార్యవర్యుండు చేతులు జోడించి, అంబా! నేను నిన్ను లేవని వాదింపలేదు. శాక్తేయులు గావించు దురాచారముల నిందించితిని. ఇదియ నా నేరము నీ వాత్మస్వరూపిణివని యెరింగితి నన్నుఁ గృతగృత్యుని గావించితివని పెక్కు స్తోత్రములు గావించెను. పిమ్మట నద్దేవియు నా విద్వత్ప్రవరుని కనేక విద్యల నొసంగి యంతర్థానము నొందినది. శంకరుఁడు నాటంగోలె శక్తియందు భక్తి విశ్వాసములు గలిగి పుడమి యందుఁ బ్రసిద్ధినొందిన శ్రీశైలాది ప్రదేశముల దశపీఠంబుల శక్తిస్థాపన గావించి కృతార్ధుండయ్యెనని యెరింగించి మణిసిద్ధుండు వెండియు శిష్యున కిట్లనియె.

ఈడిగి కాపుల కథ

వత్సా! విను మాచార్యులవారు మండనమిశ్ర పండితుని జయింప మాహిష్మతీ నగరంబునకుంజని యందుఁ జీమ కైనఁ దూరశక్యముగాని సమున్నత ప్రకారములచే నావరింపఁబడియున్న మండనుని మందిరాభ్యంతరము ప్రవేశింపనేరక చింతించుచు నప్పురబాహ్యోద్యానవనంబులో గ్రుమ్మరుచు శిష్యులతో నిట్లు విచారించెను.