పుట:కాశీమజిలీకథలు-05.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

226

కాశీమజిలీకథలు - ఐదవభాగము

మిక్కిలి ప్రమాదము నొందితిమి. కొండెగాడైన వేల్పు తపసి దుండగం బెరుంగలేక యూరక పోట్లాడితిమి. ఆహో! మనలనెట్టి మోహ మావేసించినది.

అయ్యో! అతఁడు కలహాశనుండని యెరింగియు మన మతని మాటలనమ్మి సామాన్యులవలె మోసపోయితిమికదా! బోనిండు దీన మనకొక విశేషము తెలియఁబడుచున్నది. మనకు తల్లియున్నట్లెరుగము. ఆమె యెందున్నదో తెలిసికొనుట యావశ్యకమే. కావున మనము బోవుదమని హరిహరుల మంతనము లాడికొని వైరములు విడిచి యాప్తభావముతో నాలోకపాలకులు మువ్వురును సంతసముతో నావిమాన మెక్కిరి.

అప్పుడు శ క్తిదూతికలు దేవయానము నూర్ధ్వలోకమునకు నడిపింపఁదొడంగిరి. అవ్విమానరత్నము తృటికాలములో ననేకసహస్ర యోజనములు పోయినది. ఆ మూర్తులు తమ వైరముల గురించి మాట్లాడుకొనుచుండగా నొకచోట మరియొక బ్రహ్మయు విష్ణుడు శివుండును వారియొద్దకువచ్చి నమస్కరించి పోయిరి. వారింజూచి వెరగుపడుచు నాభువనాధిపతులు శక్తిదూతికలతో' వీరెవ్వరనియడిగిన నప్పడతులు అయ్యా ! మనమిప్పుడు మీబ్రహ్మాండము దాటివచ్చితిమి ఇది మరియొక బ్రహ్మాండము. వీరు దీనింబాలించు త్రిమూర్తులని చెప్పుచుండఁగనే యవ్విమానము వారిని మరియొక బ్రహ్మాండమునకుఁ దీసికొని పోయినది.

అచ్చట మరియొక హరిహరబ్రహ్మలువచ్చి వారితో ముచ్చటించి యరిగిరి. వారి వృత్తాంతము విని త్రిమూర్తులు లజ్జావిషాదమే దురహృదయులై యిట్లు వితర్కించుకొనిరి.

ఆహా! మనమే యీ లోకములకెల్ల బ్రధానులమని గర్వపడి యొండొరుల నాక్షేపించుకొంటిమి. యిప్పుడు క్రిమికీటకాదులకంటె నధములమని తోచుచున్నది. మనవంటివారు కోటానకోటులున్నారు. ఇందరిలో మన యెక్కువేమియని పశ్చాత్తాపచితులై విచారింపుచున్న సమయంబున నవ్విమాన మత్యంత వేగముగా బోదొడంగినది. అప్పుడు బ్రహ్మవిష్ణుమహేశ్వరు లూరక యవిచ్ఛిన్నముగా గాయగుత్తులవలె వారికిఁ గనఁబడంజొచ్చిరి.

అప్పుడు వారున్మత్తులవలె మతులుచెడి తామెవ్వరో యెరుంగక పలవరింపఁ దొడంగిరి.

అట్లు మనోజవంబున నద్దేవయానంబు శతకోటిబ్రహ్మాండంబులంగడచి యమ్మహాదేవియున్న లోకమునకుం బోయినది. ఆ లోకం బంతయు దివ్యతేజోమయంబై తేరిచూడ శక్యముగాక మెరయుచున్నది. దుర్నిరీక్షమైన తదీయప్రభావిశేష మన కక్కజమందుచుఁ ద్రిమూర్తులును గరకమలంబులు ముకుళించి యమ్మహాశక్తి ననేక ప్రకారముల నగ్గింపఁదొడంగిరి.

అట్లు స్వాభిమానశూన్యులై సిగ్గుతో నగ్గింపుచున్న త్రిమూర్తులయెడఁ గనికరముగలిగి మహాశక్తి తీక్ష్ణతేజం బుపసంహరింపుచు నిజరూపము జూపినది.