పుట:కాశీమజిలీకథలు-05.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

225

సాధ్వులారా! మేము త్రిమూర్తులకు జననియైన యాదిశక్తికి బరిచారికలము ఇప్పుడు త్రిమూర్తులు ప్రధానత్వమునుగురించి కలహించి నియతవ్యాపారముల మానివేసి పడుకొని లోకములకు బీడ గలుగఁజేయుచున్నారని విని యాయాదిశక్తి వారిం దమ యొద్దకు దీసికొనిరమ్మని యీ విమానమిచ్చి మమ్మంపినది. ఆ శక్తి యనేకకోటి బ్రహ్మాండముల కధినాయకురాలు. వీరు కడపడి బ్రహ్మాండాధిపతులు. ఈవార్త మీ భర్తల కెరింగింపుడని చెప్పుటయు గౌరీ లక్ష్మి సరస్వతి లొండొరుల మొగములు జూచి కొనుచు నోహో ఇది కడు చిత్రముగానున్నది. మనభర్తలకుఁ దల్లియున్నదని యెన్నఁడును వినియుండలేదే? ఆహా యిట్టి పుత్రులంగనిన యాయమ్మ సామర్ధ్యము మిక్కిలి స్తోత్రపాత్రమై యున్నదిగదా.

అయ్యారే! ప్రధానత్వమును గురించి వీరిలోవీరే తగవులాడుకొనుచుండ వీరిపై మరియొక ప్రభ్వియున్నఁదట. అనేకకోటి బ్రహ్మాండములలో వీరొక బ్రహ్మాండమును బాలించుచున్నారఁట. అద్దేవి వీరిని మందలించుటకై పిలిపించికొనుచున్నది. బాపురే యీసారి వీరుగర్వములు వదలి వర్తింప గలరని సంభాషించుకొనిరి.

పిమ్మట బార్వతీదేవి యల్లన ప్రాణవల్లభునొద్దకబోయి యాదిశక్తి సందేశ ప్రకారమంతయు వినిపించినది. అప్పుడు ముక్కంటి యక్కజమందుచు లేచి యేమేమీ మాకొకతల్లియున్నదా? వింతలు వినంబడుచున్నవే ఏరీ ఆ దూతికల నిటుదీసికొనిరా? తెలిసికొనియెదనని చెప్పిన శర్వాణి యప్పుడే పోయి శక్తి పరిచారకులఁ దోడ్కొని వచ్చినది.

పురారి వారింజూచి మీరెవ్వరు ఏమిటికై వచ్చితిరని యడిగిన నప్పడతులు, దేవా? మేమనేకకోటి బ్రహ్మాండ జననియైన యాదిశక్తి యంతిక చారిణులము. అంత్య బ్రహ్మాండాధిపతులు తగవులాడి సృష్టి స్థితివిలయ వ్యాపారములుమాని లోకసంక్షోభము గావింపుచున్నారని దూతలవలన విని మాదేవి మిమ్ముదీసికొనిరమ్మని మమ్మంపినది. ఆమె వసించులోక మిచ్చట కనేకకోట్లయోజనముల దూర మున్నది. ఈ విమాన మెక్కిరావలయు నిదియే మావృత్తాంతమని చెప్పినవిని యమ్మహేశ్వరుం డించుక చింతించుచు, నించుబోణులారా బ్రహ్మాచ్యుతులు యొద్దకుఁబోయి వారి కీవార్త నెరింగించి విమాన మెక్కించుకొని యిచ్చటికి దీసికొనిరండు. ఏనును బయనమై సిద్ధముగా నుండెదనని చెప్పుటయు నాదూతిక లతిరయంబున విమానమును దీసికొనిపోయి శతానందగోవిందుల కత్తెరంగెరుంగజెప్పి వారివిస్మయ వారి రాళిముంచుచు నవ్విమాన మెక్కించుకొని సంచశరారియొద్దకు దీసికొనివచ్చిరి.

అప్పుడు హరిహరబ్రహ్మలు మువ్వురు గలసికొని, అక్కటా! మనము