పుట:కాశీమజిలీకథలు-05.pdf/217

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

223

బ్రహ్మ — మొగములతోఁ జేతులతోఁ బనియేమి. నేను సృష్టి చేయనిచో వీరేమి చేయుదురో చూతునుగాక!

నారదుఁడు - చూడవలసినదే.

విష్ణు — పరమేష్టీ ! సర్వజ్ఞానభిజ్ఞుండవై నీవును శివుండువోలె సంభాషింపు చున్నావేమి ?

బ్రహ్మ - ఆత్మభావంబునఁ బలుమారు నీ యొద్దకు వచ్చుచుండుటంబట్టి కదా నన్నిట్లు చులకనగాఁ బలుకుచుంటిరి ? కానిండు ఇప్పుడు నాబ్రభావమంతయుం బ్రకటించెద వీక్షింతురుగాక ?

శివుఁడు — [నవ్వుచు] మదీయ సఖరాగ్రంబు నీశిరచ్ఛేదంబున గావించినప్పుడే నీ ప్రభావము తెల్లమైనదిగదా ?

బ్రహ్మ — ఆహా ? ఆ కపాలమేగదా! నీకింత యన్న మిడుచున్నది.

విష్ణు — బిచ్చమెత్తి తినుటకు నీకపాలములేకున్న మరియొక చిప్పయేదియు దొరకదాయేమి?

శివుడు — బిచ్చమిడిన వానినే యణిఁగద్రొక్కిన కృతఘ్నులే యాక్షేపించు చుండ నేమని యుత్తర మీయఁదగినది.

నారదుడు —- మీరనినమాట సత్యమే.

బ్రహ్మ - యిరువురకు నేనధముడననియున్నది నేను సృష్టించనిచో చూతురుగా. [అని కోపముతో లేచిపోవుచున్నాడు.]

విష్ణు — మదీయరక్ష క్రియలేనిచో నీ సృష్టితోబనియేమి నీవిక సృష్టించినను నేను రక్షించనని పలుకుచు విష్ణుండు లేచిపోయెను.

శివుడు - నేను లయము జేయుచుండుటకదా సృష్టిస్తితుల కవకాశము గలుగుచున్నది. నా పని నేను జేయనిచో వీరేమి చేయుదురో చూచెదంగాకయని శివుండు కోపించి యరిగెను.

అమ్మా ! యిట్లు త్రిమూర్తులు మువ్వురు రివ్వునలేచి కోపముతో నరిగిన వెనుక దేవతులు, మునులు, దిక్పాలురు భయభ్రాంతిస్వాంతులై కిక్కురమనక గ్రక్కున వచ్చిన చక్కి నెక్కడి వారక్కడనేపోయిరి.

వారికిట్టి పొట్లాట పెట్టి నారదుఁ డేదారిపోయెనో యెవ్వరికిం దెలియదు.

తల్లీ ! తత్కారణంబునంజేసి త్రిమూర్తులును సృష్టిస్తితిలయ వ్యాపారముల మానుకొని పడుకొనియున్నారని చెప్పుచుండగనే ముప్పదికోట్ల వేల్పులయిల్లాండ్రు దిక్పాలురు ప్రోయాండ్రు పరివేష్టింప నింద్రాణి యచ్చటకువచ్చి లక్ష్మీసరస్వతు లిరు వంకలం గూరుచుండి సంభాషింపుచుండ నెద్దియో ధ్యానింపుచున్న కాత్యాయనీ మహాదేవింగాంచి నమస్కరించినది.