పుట:కాశీమజిలీకథలు-05.pdf/216

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

222

కాశీమజిలీకథలు - ఐదవభాగము

మ. పురదైత్యుల్వరశ క్తిలోకముల నున్మూలింపగాదేవత
     ల్మొర పెట్టన్వినినావొలేదొ మరి తత్పూర్వామరశ్రేణి
     సంగరమందేమిటికి న్వధింపవది శక్యంబైనచోనాఁడు
     చ్చరణంబుల్ శరణంబువేడినది కృష్ణా ! జ్ఞాపకంబుండెనే.

విష్ణు - గీ. సఖుడవని యెంచిప్రీతితో సంతతంబు
             నీపనుల నెల్ల బూనియె నేయొనర్ప
             భటుఁడవనిపల్కితౌ భళి బాగు బాగు
             కన్ను మీదికివచ్చెనే గరళకంఠ !

శివు - గీ. తుల్యగౌరవసంపత్తితో సుమిత్ర
            బుద్ధిమన్నించుచుండుటఁబో ముకుంద
            పీఠమెక్కంగవలదని ప్రేలినావు
            నడుమసిరినీకు రాబట్టి చెడితివిట్లు.

నారదుండు — [బ్రహ్మతో] తండ్రీ? నీహరిహరులు సమముగా బోట్లాడుచుండ నీవేమియు మాటాడవేమి నీ యాధిక్యతగూడ వెల్లగపరుపుము.

బ్రహ్మ — నారదా ! తొందర యేమివచ్చినది. వారిలో నొకడు పీఠమెక్కినపుడుగదా తగవు పెట్టఁదగినది.

నారదు — పీఠ మెక్కు మాటయటుండనిమ్ము. లోకాధిపతులము మేము మేమని వారిలోవారే తగవుపడుచున్నారు. నీమాట యెక్కడను ప్రశంసించుటలేదు. నీ యభిప్రాయము వేరుగానున్నది పోయి కలియఁబడి వాదింపుము.

బ్రహ్మ — వారు ప్రశంసింపకపోయినచో నాయాధిక్యత తగ్గునాయేమి ?

నారదు — [హరిహరులతో] ఈ చతుర్ముఖండేదియో చెప్పుచున్నాడు వింటిరా!

హరిహరులు — ఏమనుచున్నాఁడు.

నార - మీ యిరువురకున్నఁ దానే యధికుండట. పీఠము దానే యెక్క నర్హుడఁట.

విష్ణు — ఈ భూతపతికన్న వాని తక్కువయేమి. ఎక్కవలసినదే ?

శివుఁడు — ఈ వాసవావరజునికన్న బ్రహ్మయే యధికుఁడని నా యభిప్రాయము

నారదుఁడు — అయ్యా శివునికన్న బ్రహ్మకొక్క మొగమేగాదా తక్కువ విష్ణువుకన్న నాలుగుజేతులెక్కువ గలిగియున్నవి. మీ యిరువురకు నతండు తీసి పోవఁడు.