పుట:కాశీమజిలీకథలు-05.pdf/215

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

221

సీ॥ భస్మాసురునిచేతఁ బడినీల్గకుందువా?
             శాంబరి వానినే జంపకున్న

శివుఁడు — బృందకైయున్మాద వృత్తిగైకొనినాఁడె
                     మడియవే! నేభూతి నిడకయున్న

విష్ణు - బాణునేమిటికిఁ గాపాడలేవైతివి
                   వానివాకిలి గాపువాఁడ వగుచు

శివు - బలిచక్రవర్తి వాకిలిగాచుచలనాఁడు
                పారితివేల రావణునిఁ గాంచి.

విష్ణు — గీ॥ వార్ధిమునుగుచునుండఁగ వ్వంపుగొండ
               నిలుపలేవైతివేమి వేల్పులునుతింప

శివుఁడు - గరళముదయించి యందు లోకములఁజెరుప
             దాల్పలేకను గిరిక్రింద దాగితేమి.

విష్ణుడు - ఆహా ? అవసరము మీరిన పిమ్మట నేమియనిన ననవచ్చును.

ఉ. నీవును బ్రహ్మయుం దెలియ నేరక సంస్తుతి జేసినంత దై
    త్యావళికిన్వరంబుల ననర్థముగాఁగ నొసంగివాండ్రు దు
    ర్భావముతోడ లోకముల బాధలొనర్చుతరిన్ జగంబులం
    బ్రోవఁగలేక మచ్చరణముల్ శరణంబులు గోరుకోరొకో.

అదియంతయును మరచి యిప్పుడేమో సర్వాధికుండవని పీఠాదిరోహణంబున కుద్యుక్తుండవగుచున్నావే? చాలు చాలు.

మ. అవతారంబుల నెత్తివేమరు సముద్యద్దర్పమేపార దా
     నవులంద్రుళ్ళడగించి వెండియుమహిమన్ ధర్మంబునేనిల్ప కు
     న్న విధిప్రజ్ఞయు నీమహత్యమది యెన్న దెల్ల మౌనేటికౌ
     నవు ? రక్షించిన దానికిన్పలమిదేనా ? చండికావల్ల భా.

శివుఁడు - ఓహో ? నీవేవియో యవతారములనెత్తి నన్ను రక్షించినట్లుగాఁ జెప్పుచుంటివి. అది ప్రమాదము వినుము. వీరభటుల విజయంబులు ప్రభువులకే చేర గలవు. ప్రేష్యులకు మీరినకార్యములు మాత్రమే ప్రభువులు చేయుచుందురు. అందు వలననే నీవు నాకు బ్రేష్యుండవని చెప్పుచుంటిని

విష్ణు - ఔరా ! పశుపతీ ? మదీయావతార చరిత్రమంతయు నీదాసత్వమునకే హేతువైనదా ? బాపురే యెంతమాట వింటిని.

శివుఁడు - కాకమరేమి ?