పుట:కాశీమజిలీకథలు-05.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

220

కాశీమజిలీకథలు - ఐదవభాగము

హరునిం గలసికొనిరి. అంతకుబూర్వమే చతుర్భుజుండును జతుర్ముఖుండును తమ తమ పరివారములతో వచ్చి మేరుశిఖరాగ్రమలంకరించిరి. వారెల్ల నారదనిర్దిష్టప్రకారంబున నింద్రాదులచే నలంకరింపఁబడిన మేరుశిఖర విశాలశాలాంతరాళంబున నమరింపబడియున్న పీఠంబులం గూర్చుండిరి. ఆ సభాభవనంబున నగ్రస్థానంబున రత్నపీఠం బొండు వేయబడియున్నది దానికి దిగువగా మూడుపీఠము లమరింపఁబడియున్నవి. వాటిమీదనే మొదటఁ త్రిమూర్తులు గూర్చుండిరి. వారినంటియే దిక్పాలురు, దేవతలు, మునులు దమతమకుఁ దగిననెలవులం గూర్చుండిరి.

అప్పుడు నారదుండా సభాంతరాళమున నిలువంబడి చేయెత్తి ఓహో ! మునులార ! దేవతలార ! దిక్పాలులార ? యిప్పుడు లోకాధిపతులు మువ్వురు నిందున్న వారు. త్రిమూర్తులలో నెవ్వడధికుండని మీకు సందియము గలుగవచ్చును, అది మీ కిప్పుడు తీరఁగలదు. అని పలికి త్రిమూర్తులనుద్దేశించి మహాత్ములారా ? మీలో నెవ్వడధికుండో యని తెలియ లోకులు పెద్దకాలమునుండి సందియమందు చున్నారు. ఇప్పుడా భ్రాంతి వదలింప వలయును. అదిగో యగ్రసింహాసనము. మీలోఁ ప్రధానుఁడెవ్వడో లేచి దానిపయిం గూర్చుండవలయునని పలికి యమ్మునిపతి కూర్చుండెను. అప్పుడు రాక్షసులు భూతభేతాళములు ప్రమధులు మహేశ్వరా! మహేశ్వర శబ్దము నీకుఁగాక యెవ్వనికున్నది. నీవే సర్వాధీశుండవు కావున, నీవాపీఠ మలంకరింపుమని శివునిం బురికొల్పిరి.

విష్ణుపక్షపాతులు మరికొందరు దేవా ! విష్ణుండు సర్వోత్తముండని శ్రుతులు ఘోషింపుచున్నవి. ఈ పీఠము నెక్కుటకు దేవరగాక భూతపతి యెట్లర్హుండు ఉపేక్షించుచుంటివేల లేచి యాసింహాసనముపై గూర్చుండుడు ఎవ్వఁడడ్డము వచ్చునో చూతము గాదాయని ప్రేరేపించిరి. బ్రహ్మపక్షపాతులైన రక్కసులు కొందరు ఆహా ! విష్ణుకింకరు లింతపొగరుపట్టి యున్నా రేమి ఆ సింహాసనం బెక్కిన శివుం డెక్కవలయును లేకున్న బ్రహ్మ యెక్కవలయును. ఈ కపటాత్ము నెక్కనిత్తుమా యని బీరములు పలుకుచు లెమ్ము లెమ్మని పీఠమెక్క వాణిదవుని ప్రోత్సాహపరచిరి.

అప్పుడు త్రిమూర్తులకు నిట్టిసంవాదము జరిగినది.

శివుడు — ఇదిగో ! నేను బీఠమెక్కఁబోవుచున్నాను. వలదను వాఁడెవ్వఁడో చూతునుగా ! [అని లేచుచున్నాడు ]

నారదుఁడు - విష్ణుమొగము జూచి కనుసన్నఁ జేయుచున్నాడు.

విష్ణుండు - ఆ ఆ. నిలు నిలు పశుపతీ. నాయనతిలేక పీఠ మెక్కఁ గలవా !

శివుఁడు — గోపాలా నీ యానతి నాకేల ! వలదనుటకు నీవెవ్వడవు.

విష్ణుండు - నాకంటె నీవేమిట నధికుండవని పీఠమెక్కె.దవు ? నీకు నేను జేసిన యుపచారములన్నియు మరచి నన్నే వెక్కిరించుచున్నావుగా వినుము.