పుట:కాశీమజిలీకథలు-05.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

218

కాశీమజిలీకథలు - ఐదవభాగము

అక్కాంతకుఁ గాంతుండంతయు వక్కాణింపక మానడు. అని తలంచి సఖులంగూడికొని మయూరవాహనారూఢయై యప్పుడు వాణీదేవి వైకుంఠమునకుం బోయినది. అందు గోవిందుని గురించి భక్తులెద్దియో గుజగుజ లాడుచుండ వెరగుపడుచు నత్తరుణీ లలామ మెల్లన కమలానిలయంబునకుఁ జని యంతఃపురచారిణుల లక్ష్మీ మహాదేవి యెందున్నదని యడిగినది. శుద్ధాంతకాంతలు సరస్వతీ మహాదేవిం గురుతుపట్టి యుచిత సత్కారంబులం గావించిఁ బసిండిగద్దెపయిం గూర్చుండబెట్టి గమనశ్రమ వాయఁ జామరముల వీచుచు, దేవీ ! యిందిరా మహాదేవి యింతకుముందే దామోదరుని సౌధంబున కరిగినది.

అమ్మహాత్ముండేమియో లోకరక్షాణభిముఖుండై కోపగృహంబునఁ బడుకొని యున్నవాఁడనువార్త విని యార్తిజెందుచు నందు వోయినది. మీరాకవినిన నిప్పుడే రాగలదని చెప్పిరి. భాషావధూటి యా మాటలు విని తనసఖుల మొగముచూచుచు మేలుమేలు మంచి చోద్యములే వినంబడుచున్నవి. అని యాశ్చర్య మందుచు సుందరులారా ! గోవిందునకు గోపించుటకుఁ గారణమేమి వచ్చినదని యడిగినది అయ్యంగన లత్తెరంగేమియు మేమెఱుంగము మేరుగిరినుండి వచ్చినదిమొద లొరులతో మాటాడుట లేదట దేవీ ! నీవిందు గూర్చుండుము సత్వరమునఁ గమలాదేవి నిచ్చటికిఁ దీసికొని వత్తుము నీ రాకవినిన నద్దేవి యనుమోదించునుగదా యని పలికి కొంద రిందు ముఖులువోయి భార్గవి కత్తెరం గెరింగించిరి లక్ష్మీయు మురియుచు నరగ నత్తెరవ యొద్దకు వచ్చినది. ఒండొరులు గౌఁగలించు కొనిరి.

అప్పుడు సరస్వతి లక్ష్మితో అత్తా! మచ్చిత్త వైకల్యంబు నీకెరింగించుట కై వచ్చితిని నీకును మనస్వాస్థ్యము లేనట్లు తోచుచున్నది. మామగారు కోపించి పడుకొని యుండిరఁట నిజమేనాయని యడిగిన లక్ష్మి, సాధ్వీ ! నారాయణుండిట్లు దీనవదనుండై పడుకొనియుండుట నేనెన్నడును జూచి యెఱుంగను. కల్పాంత సమయంబున మహాసముద్ర మధ్యంబున జీవజాలంబులనెల్ల నుదరంబున నిడికొని వటపత్రంబున శయనించునని చెప్పుదురు. ఈ యకాండ ప్రళయంబునకుఁ గారణమేదియో తెలియదు. ఎంత పిలిచినను బలుకరు. లోకరక్ష యెట్లగునో తెలియదనిచెప్పి నీచిత్త వైకల్యంబునకు హేతువేమని యడిగినది వాగ్దేవియుఁ జతుర్ముఖుని విరక్తి ప్రకార మంతయుం జెప్పి యప్పడఁతిని వెరగుపడ జేసినది.

అప్పుడిరువురు విచారించి యత్తెరగు మహేశ్వరివలనఁ తెలియగోరి పరివారములతోఁ బార్వతీ మహాదేవి యొద్దకుంబోయిరి అప్పుడు పార్వతియుఁ బరమేశ్వరుండు విలయక్రియా విముఖుండై మౌనముద్ర వహించి తనతో మాటాడుట మానివేసెనని సఖులతోఁ జెప్పుచు విచారించుచున్నది. పిమ్మట లక్ష్మి సరస్వతుల రాక విని యా యిందిర యానందించుచు నెదురువోయి వారిందోడ్కొనివచ్చి సత్కార పూర్వకముగా గనకాసనములపైఁ గూర్చుండబెట్టి యాగమన కారణం బడిగిన వారు