పుట:కాశీమజిలీకథలు-05.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

217

శ్రీరస్తు

కాశీమజిలీ కథలు

56 వ మజిలీ

నవమోల్లాసము

సత్యలోకములో సరస్వతీమహాదేవి వీణాగానవినోదమునఁ గాలక్షేపము చేయుచున్న సమయంబున సఖురాలు సాధ్వసవిస్మయరసావేశ హృదయయై యరుదెంచి, అమ్మా ! అమ్మా ! అయ్యగారు నేడేమియా పడుకొనియున్నారు. కారణ మేమియో తెలియదు. మాదేవర సృష్టిక్రియావిముఖుండయి నచో లోకమునకుఁ గీడు సంభవించుం గావున నీవు వేగవచ్చి తద్విర క్తికిఁ గారణమేదియో తెలిసికొనవలయునని పలికినవిని పలుకులవెలంది తలచుచు నిట్లనియె.

ఏమీ పరమేష్టి సృష్టి వ్యాపారముమాని పడుకొనియెనా! పగటివేళ విధాత యెప్పుడు నట్టిపనిచేయఁడే! మేరు శిఖరాగ్రమున జరిగిన సభకుఁబోయిన యలసటచే విశ్రమించిరని తలంచెదను. అయ్యో! అచ్చట నేమేమి విశేషములు జరిగినవియో తెలిసికొన మరచితినే ! వచ్చినవెంటనే యడుగవలయునని తలంచితినికాని యప్పుడు కోపముఖముతో నుండుటచేఁ బల్క రించితినికాను ? ఆ సభలో నీయన కేమయిన యవమానము రాలేదుగదాయని యాలోచించుచు విపంచి పాడుట చాలించి యప్పుడు ప్రాణేశ్వరునొద్ద కరిగి మంచముపయిఁ గూర్చుండి ముసుంగించుకయెత్తి, ప్రాణేశ్వరా ! నిమిషమునకనేక జీవరాసుల సృష్టించెడు మీరిటుల పడుకొనిన లోకములకుఁ బ్రళయముకాదా లోకేశా ! మీరెవ్వరిపై గోపింతురు ! కోపకారణం బేమి వక్కాణింపుడని యెంతయో నైపుణ్యముగా నడిగినది.

విధాతయేమియ మాటాడక యర కనుమోడ్పుతో నుస్సురని నిట్టూర్పు నిగుడింపుచు నవ్వలకు దిరిగి మరల ముసుఁగు లాగికొని పడుకొనియెను. సరస్వతి యెన్నిగతులఁ బ్రతిమాలినను మాటాడక లేవక పల్కరించక యట్టె పడియుండెను. అప్పుడప్పల్లవపాణి తల్లడిల్లుచు అయ్యో! ఆ యోలగములోఁ గమలోదరునకేదియో యవమానము గలిగినది. కాకున్న జతుర్ముఖుండిట్లుత్సాహ విముఖుండుకాడు. అత్తెరం గేదియో వైకుంఠమునకుం బోయి లక్ష్మీమహాదేవి వలనం దెలిసికొనియెదను.