పుట:కాశీమజిలీకథలు-05.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

216

కాశీమజిలీకథలు - ఐదవభాగము

తివా ? వచ్చుటకు సమ్మతించితిరాయని యడిగిన దేవముని చేతులు నలిపికొనుచు, స్వామీ ! ఇప్పుడు మునుపటి హరియ వెనుకటి బ్రహ్మయు ననుకొనుచున్నారు కారు కారు. వారి యభిప్రాయములు చాలమారినవి. కపాలవాణి యాజ్ఞానుసారము వచ్చుటకు మేము కింకరులమాయేమి యని నా మాటలు విని యాక్షేపించిరి. మిమ్మె యచ్చటికి రమ్మని పలికిరి. అప్పుడు నేనొక యుపాయము చెప్పితిని. యీ సభ మీ మూడులోకములయందు గాక మేరుపర్వతశిఖరమున గావించుటకును అచ్చటికందరు వచ్చుటకు నిరూంచితిని. అందులకు మీరును సమ్మతింపవలసినదే అందరు గలసినపిమ్మట నా సభయందు వారి నీ మాట ముదరింపవచ్చును. ఇప్పుడేమియు నడుగవలదని చెప్పి యొప్పించి సభాదివసంబు నిరూపించి తదనుజ్ఞనుగయికొని వాసుదేవ చతుర్ముఖుల యొద్ధకరిగి వారికత్తెరం గెరింగించి సభకు వారివారి పరివారములతో వచ్చునట్లాడంబడిక జేసి యటగదలి నాకంబునకుంబోయి పురుహూతునిచే నర్చింతుడై యిట్లనియె

దేవేంద్రా ! యిప్పుడిందుగూడ సావకాశముగా మాట్లాడుటకు సమయము కాదు. ఇప్పుడు త్రిమూర్తులకు నలవికాని కలహములు బలసినవి. మువ్వురుం గలసికొని ప్రసంగములు జేయుదురట. మేరు శిఖరాగ్రమున సభజేయుటకు నిశ్చయించిరి. తత్ప్రదేశమంతయు మూడు దినములలో బాగుచేయించి యలంకరింపవలయునని త్రిమూర్తులును నీతో జెప్పమనిరి పెక్కేల హరిహరహిరణ్యగర్భుల పట్టణములకన్నను, స్వర్గము కన్నను తత్ప్రభాభవనము సొంపుగా నండవలయును దేవతలతో, మునులతో, దిక్పాలురతో, సిద్ధులతో, సాధ్యులతో, విద్యాధరాది పరిచారకులతో వచ్చి నీవందు వేచియుండవలయు నేటికి నాల్గవనాటి కందరు నచ్చటికి వత్తురని యెన్నియో చెప్పి నారదుం డెందేనిం జనియెను అని యెరింగించి యమ్మహాశక్తి శంకరాచార్యునికి దదనంతరో దంతం బిట్లని చెప్పదొడంగెనని మణిసిద్ధుండు గోపాలునితో నవ్వలిమజిలీయందా కధాశేషము వక్కాణింప దొడంగెను.

అని యెరింగించి మణిసిద్ధుం డప్పుడు వేళయతిక్రమించుటయు గథ జెప్పుట చాలించి పరమానందకందళిత హృదయారవిందుండైయున్న శిష్యునితోగూడ గ్రమంబున నవ్వలిమజిలీ జేరెను.

ఇది శ్రీ మధిర సుబ్బన్నదీక్షితకవి రచితమైన కాశీయాత్రాచరిత్రమను మహా ప్రబంథమున శంకరాచార్యచరిత్రము. అష్టమోల్లాసము.

సంపూర్ణము

శ్రీశ్రీశ్రీశ్రీశ్రీ