పుట:కాశీమజిలీకథలు-05.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ శంకారాచార్య చరిత్రము

27

మఱల సకల శాస్త్రపారంగతుండగు గురుని మఱియొకని నియమించెను. ఏక సంధ గ్రాహియగు శంకరు డా యుపాధ్యాయునికించుకయు శ్రమ గలుగనీయక మణిదర్పణమువలె సకల విద్యలం గ్రహించి యుపాధ్యాయునకుఁ బాఠములు జెప్పునప్పుడు తప్పులు దిద్దుచుండును.

ధూళిచే నాడుకొను నీడుగల యా బాలునకుఁ గావ్యనాటకాలంకారాదిగ్రంథములు క్రీడనకములై యొప్పుచుండెను. అప్పుడు శివగురుండతని శరీరమును జౌలకర్మచే సంస్కరింపజేయుటయు నది యాహుతులచేఁ బ్రజ్వరిల్లు నగ్ని తేజమువలెఁ బ్రకాశించినది. బృహస్పతినిఁ దిరస్కరించు బుద్ధిబలముగల శంకరుని మ్రోల బాల్య దశయందే యెట్టి పండితుఁడును నోరు మెదల్చుటకు వెఱచుచుండెను. చిన్నతనము నందే యతండు కుత్సిత మతముల ఖండించుచు స్వమతమును బ్రతిపాదించుచుండెను. అంత నొకనాడు శివగురుండు కుమారుని యపూర్వ ప్రజ్ఞావిశేషంబులం దలంచుకొని యచ్చెరవందుచు నాహా! వీని ప్రాయమెంత? విద్యాగ్రహణశక్తి యెంత? వీనికి గురువులు నిమిత్తమాత్రులే కాని వారివలన నొక విషయము వీఁడు గ్రహించుచున్నట్లు కనంబడదు. ఎన్నడో నేర్చికొనియున్నట్లు విద్యలన్నియు వీని ముఖమునుండి వెలువడుచున్నవి యవి శంకరుని మాట యేల తప్పును. వీనికి బ్రాయము చాలదని యుపనయనముఁ జేయనిచో వేదపఠనాధికారము లేకపోవును. గ్రహణశక్తినింబట్టి వీని కుపనయనముగావించెద. వీనిచే నా కులమంతయుఁ బవిత్రముగాగఁలదని తలంచుచు దత్ప్రయత్నము చేయుచున్నంతలోఁ గృతాంతుండతని నిజభువనాగంతుకనిఁ జేసికొనియెను. కట్టా! యముఁడు జంతువుల కృతాకృతముల నరయఁడు గదా! శివగురుని నాముద్దు బాలుని కుపనయనమైనం జేసికొననీయక కాలధర్మము నొందించెను. ఈ సంసారమున నుత్తముఁడగు కొడుకు గలుగుటయే దుర్లభము. కలిగినను లోకోత్తరమైన తదీయ వైభవముఁ జూచుట కడు దుర్లభమని చెప్పుటకు శివగురుఁడే నిదర్శనము. అట్లు నాక లోకమలంకరించిన శివగురుని కళేబరము పైఁబడి సతీదేవి ప్రాజ్ఞురాలయ్యు లోక వాసనా విశేషంబునఁజేసి శోకించుచు, హా ప్రాణనాథా! నీముద్దుకుమారుని విడిచి యెక్కడికిఁ బోయితివి. వీనిపై నీకుఁగల ప్రేమయంతయు నేమయ్యెను. వీని యుపనయనమున కెంతయో ప్రయత్నముఁ జేసితివే యేదియు లేకపోయెను. ఇఁక వీని విద్యాబుద్ధులు జూచి సంతసించువా రెవ్వరు. మాకు దిక్కెయ్యది. అయ్యో యేమి చేయుదము. ఈ వైధవ్య వ్యధ యెట్లు సైతును కట! కటా! విధి యెంత క్రూరుఁడ వైతివిరా యని యనేక ప్రకారముల విలపించుఁ దల్లి నూరడించుచు శంకరుం డిట్లనియె.

జననీ! జననము గలవారికి మరణము రాకయుండునా? జంతువులకుఁ గృతాంతుఁడు బంధువుఁడా? శరీరములు శిలానిర్మితములా? యిట్లెఱింగియు మమత్వమే సంసారవృక్షమునకు బీజము. మనము మాత్ర మెల్లకాలము జీవింతుమా.