పుట:కాశీమజిలీకథలు-05.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

28

కాశీమజిలీకథలు - ఐదవభాగము

కాలమునఁ బరిపక్వమైన ఫలము చెట్టునుండి రాలినట్లు మనుష్యులు గాలానుసరణముగా సమయుచుందురు. దానికిఁ గర్మయే కారణము. కర్మబద్ధులగుటయే బంధమునకు హేతువు. మా తండ్రి కృతకృత్యుండై స్వర్గంబలంకరించెను. అతని విషయము చింతించినఁ బ్రయోజన మేమియున్నది. నేను గలిగియుండ నీకేమి కొఱంత. తల్లీ? దుఃఖమును విడువుము వైరాగ్యవృత్తి నవలంబింపుమని తత్త్వోపదేశముగాఁ బలికిన విని సతీదేవి తదీయ ప్రౌఢ వాక్యంబుల కచ్చెరువందుచు శోకోపశమనము గావించు కొనియెను. పిమ్మట నామె శివగురునికి దహనాద్యపర సంస్కారములు జ్ఞాతులచేఁ జేయించి కుంతియుంబోలెఁ బతితో సహగమనముఁ జేయక కుమారుని రక్షించుచు నొక సంవత్సర మతికష్టముగాఁ గడిచినది.

పిమ్మట సతీదేవి శంకరునికి మిగుల వైభవముగా నుపనయనము గావించినది. అప్పటికే శంకరుండు సకల విద్యాపారంగతుండైనను లోకవిరుద్ధము గాని యట్లుగా గురుకులవాసముఁజేసి వేదవేదాంగములఁ జదువఁ బ్రారంభించెను.

శంకరుని విద్యాభ్యాస వైచిత్ర్యము

శంకరునితో విద్యాభ్యాసముఁజేయుచున్న సహాధ్యాయులొకనాఁడు రహస్యముగా ఇట్లని సంభాషించుకొనిరి.

సుమతి — గుణవర్మా! యిది యేమి చిత్రము శంకరునిం జూడ జేనెడు లేడు. వీఁడి విద్య లన్నియు నెప్పుడు చదివెనో తెలియదు. మొదట నన్ను వీనితో సహాధ్యాయునిగా నియమించి నప్పుడీ యల్పునితో సమముగా నెంచిరేయని గర్వపడితిని. ఇప్పుడు వాని ముందర నేనేమిటికిఁ బనికివచ్చితిని గాను.

గుణవర్మ - మీ యిరువురను సమముగాఁ బరీక్షఁజేసితిరా ఏమి?

సుమతి - నిన్న నీవు లేవా యేమి?

గుణవర్మ - లేను గురువస్త్రక్షాళనార్థమై యరిగితి నప్పుడేమి జరిగినదో చెప్పుము?

సుమతి - నేను వేదమంతయు నొక సంవత్సరములోఁ జదివి బ్రథమ పరీక్షలో సుమతియను బిరుదు వడసితి. నది యెఱుంగుదువా ?

గుణవర్మ - ఆ మాట విని యుంటిని.

సుమతి - అట్టి నన్ను నిన్నఁగాక మొన్న వేదము ప్రారంభించిన శంకరునితో కలిసి పనసరువ్వు పెట్టుమని మన గురువుగారు నాకు నియిమించిరి.

గుణవర్మ — దానందప్పేమి యతండు క్రొత్తవాఁడు గావున నీతోఁ గలిపి చెప్పుమనిరి. వానికిఁ దప్పులు వచ్చిన నీవు దిద్దుదువనియే వారి తాత్పర్యము. తరుచు బుద్ధిమంతులతో మందమతులం గల్పుచుందురు గదా ?