పుట:కాశీమజిలీకథలు-05.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

కాశీమజిలీకథలు - ఐదవభాగము

తిలక — బాపురే నీ యుత్ప్రేక్షములన్నియుఁ బ్రౌఢకవివాక్యస్తుత్యములై యున్నవిగదా. ఈ పాపనిదృష్టిప్రసారములు నాకు మిగుల వింతగాఁ గనంబడు చున్నవి. ఎద్దియో యలంకారముఁ కల్పించి చెప్పుము.

బోధిని - మదనదావానల జ్వాలాసంకులమై యామయకంటక భయంకరమై యొప్పు సంసారతాపంబునం దపించువారికి నమృతమును వర్షించు వీని దృష్టి ప్రసారములు రక్షకములగుంజుమీ.

తిలక — కృత్తికా! యిక్కలికి పలుకు లసత్యములు కావు. ఈ శిశుతిలకము లోకైక విఖ్యాతుండగునని దైవజ్ఞులు చెప్పియున్నారు గదా!

కృత్తిక — అవును. కానిచో నిట్టి యద్భుత రూపలక్షణములు సామాన్య శిశువులకుం గలిగియుండునా?

బోధిని - పురాకృతసుకృత విశేషంబునంగాక వీనిఁ జూచుట లభించునా? మనము కృతకృత్యులమైతిమి. ప్రాకృతులు వీరి మహిమఁ దెలిసికొనఁజాలరు సుమీ.

తిలక - మనము వచ్చి పెద్దతడవైనది. పోవలదా వీని రూపమెంతసేపు చూచినను జూడవలయుననియే యుండును.

అని యమ్మహాడింభకుని వర్ణించుచు నా సాధ్వీరత్నములు కొంతసేపందుండి తమతమ నివాసంబులకుం జనిరి.

శంకరుండును బాలమృగాంకునివల ననుదిన ప్రవర్ధమానుండగుచుఁ తలి దండ్రుల మనోరధము లభివృద్ధినొందఁ గ్రమంబున నవ్వుటయుం, బొర్లుటయు మణి గుచ్ఛంబుల వీడించుటయుఁ, బలుకుటయు, నడచుటయు నాఱు మాసములకు నేర్చు కొనియెను.

శంకరుని బాలక్రీడలు

మఱియు నాశిశువు సంవత్సరము ముగియువరకు స్వభాషనంతయు లెస్సగా గ్రహించి నిర్దుష్టముగా మాటాడదొడంగెను. సంవత్సర ప్రాయముగల యాపాపండు సంస్కార యుక్తముగా మాటాడుటఁ జూచి యెల్లవారు విస్మయ సంతోషములఁ జెందుచుండ దల్లిదండ్రుల మాట జెప్పనేమిటికి? అబ్బాలుండు రెండవ యేఁట సమస్తభాషలు లిపునులు వ్రాయుటకును, జదువుటకును సమర్థుఁడయ్యెను. మూఁడవయేఁడు జొరఁబడిన తోడనే శంకరుఁడు శ్రవణములేకయే కావ్యనాటక పురాణాది గ్రంథ విశేషములు స్వయముగాఁ దెలిసికొనియెను. శంకరుని విద్యాగ్రహణ శక్తి యరసి శివగురుండంతరంగమున వెరఁగందుచుఁ గంటకముదగులునని వెఱచి యప్పుడా శిశునకుఁ జదువుఁ జెప్ప నొక యుపాధ్యాయుని నియమించెను. కాని వాని కతనివలన నించుకయుఁ బ్రయోజనము లేకపోయినది. అది గ్రహించి శివగురుండు