పుట:కాశీమజిలీకథలు-05.pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

213

జ్యేష్టుండు నా యెదుట దానధికుండని తెలుపు వచనముల చెక్కు చదివి యామాట మీ యిరువురకుం జెప్పిరమ్మని చెప్పెను.

అప్పుడు నేను వెరచుచు మరుమాట పలుకక యటగదలి వైకుంఠమునకుం బోయి హృషీకేశుని దర్శించితిని అతండు నన్ను మన్నించుచు లోకవిశేషము లేమని యడిగెను. దాచనేరక దేవముని సంవాదప్రకారము బ్రహ్మవచన ప్రవృత్తియు నెరింగించితిని.

అప్పుడు వాసుదేవునికి బ్రహ్మపయి నంతకోపము రాలేదుగాని మీ రెక్కుఁ డని పలికిన మునులపయి వచ్చిన కోపమిట్టిదని చెప్పజాలను ఆహా! లోకము లేలు వారికి యట్టి యాగ్రహము గలిగినచో సామాన్యుల నెన్ననేల! అమ్మునుల జంపుదు ననియు, లోకముల భస్మము చేయుదుననియు జక్రము గిరగిర ద్రిప్పుచు దేవరపయి గూడ రోషమును బూనెను. అక్కటా! దామోదరుడు దేవరమహిమ నెరుంగడు. ఏమోయనుకొంటిని. అతని చక్రము మీత్రిశూలము కొనకు దగిలికొనిన జక్కిలము లాగున విరిగి ముక్కలు కాకపోవునా? మీ రాగ్రహించిన నిలుచువారెవ్వరు, భైరవ వీరభద్రాదులు మీయంశజాతులుకారా! కేశవునికిట్టి స్వాతిశయబుద్ధి యేమిటికి గలుగవలయునో తెలియదు. ఇవియే యచ్చట జరిగిన విశేషములు. లక్ష్మి వారింపనిచో నీపాటికి చక్రధార మీ త్రిశూలమునకు దగిలికొనకపోవునా యని చెప్పుటయు త్రిలోచనుండు రోషారుణలోచనుండయి యిట్లనియె.

నారదా! దేవసభలో నేనధికుండని పొగడినంతనే మునులపయి వైకుంఠునకు గోపము వచ్చినదిగా! రానిమ్ము రానిమ్ము. మదీయ శాంతత్వమే యతని నిటులు వాచాలుని గావించినది. గర్వము యుక్తాయుక్తవివేకము గలుగనీయదుగదా! మరియు నతం డలిగి యేమేమి మాటలాడెనో వక్కాణింపుము. మదీయ రుద్రావతారచరిత్ర మరచెనుగాబోలు. భళిరా! యని యడిగిన నారదుండు స్వామీ! నాచే బలుమారేల జెప్పించెదరు దామోదరునకు దా నధికుండనియు మీరు దక్కువవారనియు గట్టియభిప్రాయము గలిగియున్నది మీరుచేసిన తప్పులన్నియు నతండు సవరించుచున్నాడట లేనిచో లోకము లీపాటికి నాశనము నొందునట. మీ బలములు మీరు విచారించుకొన వలసినవే మాబోటులకు దెలియ శక్యముగాదని పలికి రోషమెక్కించెను.

అప్పుడు ఫాలాక్షుండు రూక్షణవీక్షణంబులు వీక్షింపుచు దెసలద్రువ నట్టహాసముజేసి కేల త్రిశూల ముంకింపుచు నౌరా ? నారాయణుండెట్టి వీరుండయ్యెను అతని యండబూని నేను లోకముల బాలించుచున్నానా ? చక్రము నాపయిం బ్రయోగింప యత్నించెనేమి? బాగు బాగు రమ్మనుము. ఫాలేక్షణము దెరచి తృటిలోఁ గొడుకు పోయిన దారి జూపెదను. ఆప్తుండని సమానప్రతిపత్తి యొసంగి మన్నించుచున్నందులకు మంచి యభిప్రాయమే కలిగినది. బ్రహ్మకన్న దన యతిశయమేమియున్నది మదీయ చరణశిరః ప్రదేశముల దెలిసికొనలేక యిరువురు తిరిగిరాలేదా మృషలాడెగాన