పుట:కాశీమజిలీకథలు-05.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

212

కాశీమజిలీకథలు - ఐదవభాగము

యతండు త్రికాలవేదియగుట రాబోవునది యెరింగియే యది యనివార్యమని యట్టి పోరాటములు పెట్టుచుండును. అతనికి గామ క్రోదాదులులేవు. నిస్సంగుండగుట నతని యెడ యందరికిఁ గౌరవము గలిగియుండు నని చెప్పుచుండగనే సిద్దు లతనిం దీసికొని వచ్చి శివునెదురనున్న రత్నపీఠముపైఁ గూర్చుండఁబెట్టిరి. నారదుండు పార్వతీపరమేశ్వరులకు నమస్కరించి తదాజ్ఞ నుచితపీఠంబునం గూర్చుండెను.

అప్పుడు శివుండు శరశ్చంద్ర చంద్రికానిచయములతో మందహాస జ్యోత్స్నలు వియ్యమందుచుండ నారదునితో, మునీంద్రా ! నీవెచ్చటనుండి వచ్చు చుంటివి? సురలోకవార్త లేమైనం గలవా? సర్వలోక విశేషములం దెలుప నీవు వార్తా పత్రికవంటి వాడవు. వింతల నెరింగింపుమని యడిగిన నాజడదారి యిట్లనియె. దేవా! నీ వాదిదేవుడవు నీవెరుంగని దేమున్నదిఁ నాకడుపులో నేరహస్యము దాగదని మీ రందరు నెరింగినదేకదా? బ్రహ్మయు విష్ణుండు నిట్లే యడిగిరి. నిజము జెప్పినంత వారికిఁ గోపము వచ్చినది. అన్నన్నా దామోదరున కింత కోప మున్నదని యెన్నఁడు నెరుఁగను. లక్ష్మీ యడ్డమువచ్చినది కాని లేనిచో లోకము లీపాటికి భస్మములై యుండునుబాబూ! ఎప్పుడును నిజము చెప్పరాదు. ఆ వార్త జెప్పిన మీరు మాత్ర మలుగ కుందురా మీకు రుద్రనామము సహజమై యున్నది.

మీకు నిజము చెప్పనేల, లోకసంక్షోభము గావింపనేల. మీ దర్శనమైన డింతియచాలును. అనుజ్ఞయిండు, పోయి వచ్చెదనని పలికిన నవ్వుచు మహేశ్వరుం డిట్లనియె. నారదా! బ్రహ్మయు విష్ణుండును నిన్నేమడిగిరి, నీవేమిచెప్పితివి. వా రేమిటి కలిగిరి. ఆ వృత్తాంత మేదియో చెప్పుము. వినుదనుక మనస్సు తొందరపడుచున్నది. నీవార్త జెప్పిన నాకును గోపమువచ్చునా? పోనిమ్ము వచ్చిన వచ్చుగాక నీ కేల యదార్ధము జెప్పుమని సానునయముగా నడుగుటయు కొంతసే పాలోచించి సంశయించువాఁడుబోలె నభినయించుచు నతం డల్లన నిట్లనియె.

మహాత్మా! నిజము చెప్పెదవినుండు ఈ నడుమ దేవలోకములో సభ జరిగినది. అందు ద్రిమూర్తుల తారతమ్యముగురించి దేవతలకును, మునులకును బెద్ద సంవాదము జరిగినది. మునులు మీరధికులనియు సురలు విష్ణుండధికుండనియు బ్రహ్మను గూర్చి మరికొందరు ప్రసంగించిరి. అందరును మీ ఇరువురుకున్న విరించి యల్పుండనియే నిరూపించిరి. మీరధికులని వాదించిన వారు బ్రహ్మర్షులు యోగులు మొదలగువారు. విష్ణుడధికుండని వాదించినారు భోగులు, సురులు ఆ సంవాదము బెద్దతడవు జరిగినది. ఆ ప్రసంగము విని సంతసించుచు నేను బ్రహ్మలోకమునకుంబోయి విరించిని దర్శించితిని. అతండును నన్ను మన్నించుచు విశేషము లేమని యడిగిన దేవముని సంవాద ప్రకారం బెరింగించి నాయొద్ద నిజము దాగదుగదా! మీ యిరువురకన్న దన్నల్పునిగ దలంచిరని వేల్పులపయి, మునులపయి తగని కోపముజెందుచు సుర