పుట:కాశీమజిలీకథలు-05.pdf/205

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

211

వాదమునకు బురికొలిపితిని. కాని వారు మదీయ భక్తి విశ్వాసములు గ్రహింపనేరక కడుపు నిండించుకొనుటకై యట్లనుచున్నానని తలంచి పెదవి గదపక మునివచనముల కగ్గపడిరి. దేవా! వాది యల్పమతియైనచో మతప్రాబల్యము తగ్గునా? యనుటయు నాశ్యాహుతిఁ బ్రజ్వరిల్లు నగ్నిహోత్రుండువోలె మండుచు నారాయణుండు బీఠము నుండి లేచి నిలువంబడి చక్రము గిరగిరంద్రిప్పుచు నిట్లనియె.

నారదా! ఇప్పుడు నేను విశ్వరూపముదాల్చి విజృంభించుచున్నాను, మదీయ చక్రధార జతుర్దశ భువనములతో గూడ శివునిరూపుమా పెదను. అందు శివుండధికుండని నుడివిన మునుల నడ్డుపడమని చెప్పుము. ఇంద్రునకింత బుద్ధిలేకపోవలయునా ! మునులన్న మాట కాదనక యూరక వినుచుండ.నా. ఇప్పుడు నాచక్రధార గాచుకొను వాడెవ్వడో చూడమని రౌద్రావేశముతో బలుకుటయు వారించి ముకుళితకరకమలయై కమల యెదుర నిలువంబడి యల్లన నిట్లనియె

ప్రాణేశ్వరా ! శాంతస్వభావముగల మీ రిట్లలిగిన నెవ్వరు నిలువగలరు. మునులనినమాటకు శివునిపై గోపింపనేల. ఆదియునుంగాక యీతపని కలహమె భోజనముగా గలవాడు. ఈ జడదారి మాటలెంత సత్యములో విచారింపక లోకముల నాశనము చేయుదురేల? ఎవ్వరికే బోరాటములుపెట్టి కడుపు నిండించుకుంటివా యని యీతడు వచ్చినప్పు డడుగలేదా, అన్నియు మరచి యలుగుట తగదు.

శివుండు మిమ్మెదిరించినప్పు డేమిచేసినను నుచితమని యేమేమో బోధించి వైకుంఠుని గోపాగ్నిని గొంత జల్లార్చినది. అప్పుడు దామోదరుం డించుక శాంతుండై తలయూచుచు, నారదా! నీమాటల గొంత విమర్శింపవలసియున్నది. నిక్కముగా దేవలోకములో సభ జరిగినదా? మునులును సురవరులును వాదించిరా ? యని యడిగిన నతండు స్వామీ! నే మీముందరనే దబ్బరలాడుదునా బ్రహ్మచెప్పిన మాటలన్నియుం జెప్పిన నన్ను గొండెకాడనిపోవుదురనియే వెల్లడించితినికాను. ఈ మహాదేవి చెప్పినట్లు మీ జోలికిరాని శివునిపై నలుగుట యుచితముకాదు. నేను ప్రచ్ఛన్నముగాబోయి యాయన యభిప్రాయ మెట్లున్నదో తెలిసికొని వచ్చెద, బిమ్మట యుక్తానుసారము గావింతురుగాని యని యేమేమో చెప్పి యచ్యుతు నొప్పించి యప్పుడే యప్పారికాంక్షి కైలాసమున కరిగెను.

అప్పుడు పార్వతీ పరమేశ్వరులు కైలాసశిఖరాగ్రమున మందార తరు ప్రాయమున జంద్రకాంత శిలావేదిక పయిన గూర్చుండి వినోద కథాకాలక్షేపము చేయుచుండిరి. పార్వతి నారదునిరాక ప్రమధులవల్ల విని, ప్రాణేశ్వరా! యీతండు మహర్షియయ్యు గలహప్రియుండయ్యెనేమి. ఎట్టి సంక్షోభము కలిగినను సంశయింపక తగవులుపెట్టి యానందింపుచుండునుగదా? మేరువునకు విలస్యమునకు బోరాటము పెట్టుటచే లోకములు తల్లడిల్లలేదా ? అతండు కొండెగాదని నిరసింపక మీబోటులతని సత్కరింపుచుందు రేలయని యడిగిన బరమేశ్వరుండు నవ్వుచు నిట్లనియె. దేవీ!