పుట:కాశీమజిలీకథలు-05.pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

210

కాశీమజిలీకథలు - ఐదవభాగము

కాలహరణము చేసికొన నేలనని మాటలాడిరి కారనియు దలంచెదను. సమయము రాక పోవునా ! మునులు నాయొద్దకు రాకపోవుదురాయని యసూయా కలుషితమతియై పలికిన విని నారదుండు వాసుదేవున కిట్లనియె.

అచ్యుతా ! జగత్కారణులయిన త్రిమూర్తుల ప్రభావము దెలిసికొనుటకు మాబోట్లకు శక్యమగునా, ఏదో మాకు దోచినటుల వక్కాణించితిమి. మునులయెడ మీరును సురలయెడ శివుండు నిరువురయెడ బరమేష్టియు నలుక బూనియున్నచో మా బ్రతుకులెటుల సాగును. బ్రహ్మ మీయిరువురికన్న దన్ను దక్కువవాడని సురలును మునులును బలికి మిమ్మెక్కుడుగా బ్రశంసించిరని నావల విని తగని కోపము బూని వారినెల్ల బరిభవింతునని శపధముజేసి యున్నవాడు మీ యిరువురకన్నదానే ప్రధాన దేవతయని వాదించి గెలుపుగొనగలడట. అంత నప్పుడు నాయెదుట దానధికుండను ప్రమాణవచనము లెన్నియేని జదివెను వేదమంతయు దనపరముగా నున్నదని యర్ధము జెప్పెను.

మీ మహిమ మీకుగాక యొరులకు దెలియ శక్యమగునా యని పలికిన విని కమలనాభుండు మరియుం దివియుచు, నారదా! మదీయు నాభికమలంబునం బొడమి కర్తవ్యమెఱుంగక చింతించుచున్న బ్రహ్మకు నేను బ్రత్యక్షమై పుత్రవాత్సల్యముతో సృష్టిక్రియా సామర్థ్యము గలుగజేసితి. నామాటమరచి హిరణ్యగర్భుండు నాకంటె నధికుండనని గర్వపడిన నేమనదగినది ఆ మాటలు విని నీవెట్లు తగిన సమాధానము జెప్పక యూరకొంటివి.

అన్నన్నా ! కాలమెట్టి విపరీతబుద్ధులు పుట్టించును. దేవతలు మమ్మెక్కుడని పలికిరనివిని యీసు జెందనేమి ? ఆత్మప్రభావ సబిజ్ఞు లిట్లే పలుక చుందురు. నారదా ! నీవుపోయి బ్రహ్మతో నామాటగా బోధింపుము. నీయందు బుత్రవాత్సల్య ముంచి గాచుచున్నది. యెఱుగక నాకంటె నధికుండనని గరువము జెందుచున్నవాడ వట. మత్పరాక్రమము చవిచూడ నభిలాష గలిగియుండిన నట్లు తలంపుము. వద్దు వద్దు నీ యధికారమునకు దగినట్లు మాట్లాడుమని చెప్పిరమ్మని పలికిన నంతరంగం బుప్పొంగ సంగనాశనుం డిట్లనియె. స్వామీ! బ్రహ్మ మీ యనుగ్రహపాత్రుండని యెల్లర నెఱింగినదే. తాను సర్వాధికుండనని గర్వపడిన లోకులు సమ్మతింతురా ! నేనామాట లిదివరకే యాయనతో జెప్పితిని. అమాట యటుండనిండు. హరిహర తారతమ్యము గురించి యేవిద్వాంసులు శంకాస్పదులగుచున్నారు. పాపభయంబున మునులకు వెరచి సుర లూరకొనిరని మీ రంటిరికాని మునులుచెప్పిన ప్రమాణవచనములు వినిన బాలునకైన శివుం డధికుండని తెలియకమానదు. మీ విషయమై వాదించువారు విద్యాబలశూన్యులగుట దగిన ప్రమాణములు చూపలేకపోయిరి. మీయొద్ద దాచనేల అప్పు డందరికి మునుల వాక్యములయందు విశ్వాసము గలిగినదిసుండీ !

అప్పుడు నేను దేవర భక్తుండనగుట నూరకొనలేక సురలకు రోష మెక్కించి