పుట:కాశీమజిలీకథలు-05.pdf/203

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

209

తగవని బోధింపుము ? పొమ్మనిపలికి చింతాకులస్వాంతుండై శతానందు డంతఃపురమునకు బోయెను.

అప్పుడు దివిజయంతి తన యుద్యమము కొనసాగుచున్నది గదా యని యంతరంగమున నుప్పొంగుచు హిరణ్యగర్భుని వీడ్కొని యప్పుడు వైకుంఠమునకుం బోయి ద్వారపాలురవలన దనరాక నారాయణున కెఱింగించుటయు కమ్మహాత్ముండు సంతోషింపుచు సవినయముగా నద్దేపమునింతోడి దేర నేకాంతభక్తులం బనిచెను. వా రత్యంత భయభ క్త విశ్వాసములతో నారదుం దోడ్కొనిపోయి వైకుంఠున కాసన్న ప్రదేశమున నిడిన పీఠంబుపై గూర్చుండబెట్టిరి.

అప్పుడు విష్ణుండు మందహాస శోభిత ముఖుండై మునీంద్రా! ఇప్పు డెందుండి వచ్చుచుంటివి. ఎవ్వరికైనం గయ్యంబులు పెట్టి కడుపునిండించుకొనుచుంటివా విశేషము లేమియని యడిగిన నవ్వుచు నారదు డిట్లనియె. మహాత్మా ? అల్పుల పోట్లాటవలన నాయాకలి యేమి తీరెడిని. దేవసభలో మొన్న సురలకును మునులకును గొంచెము సంవాదము జరిగినది. అక్కలహంబు నాపొట్ట కేమూలకును జాలినది కాదు. ఆ జగడమువిని యందుండి బహ్మలోకమునకుంబోయి చతురాసనుం దర్శించి యిప్పు డిచ్చటికి వచ్చితిని. ఇదియే విశేషములని చెప్పిన నప్పుండరీకాంక్షుం డిట్లనియె. నారదా ! మునులకు సురలకు నేమిటికి సంవాదము జరిగినది. అతైరం గెఱింగింపు మనుటయు నమ్ముని శిఖామణి దేవా ! మరియేమిటికిగాదు. హరిహర హిరణ్యగర్భులలో నెవ్వ డధికుండని ప్రశంస వచ్చినది అందుల గురించి కలహము వచ్చినదని చెప్పెను. ఆ మాటవిని రమానాధుండు యతీంద్రా ! అయ్యోలగములో దుదకెవ్వ రధికులని నిశ్చయించిరి. సంవాద మేరీతి జరిగినదో నుడువుమనుటయు నతం డిట్లనియె.

దేవా ! నుడువుట కేమియున్నది. మునులందరు శివుండధికుం డనిరి. సుర లందరు దేవరయే యధికుండనిరి. బ్రహ్మ యిరువురకన్న నొకయంతరము తక్కువ వాడని యందరుంబల్కిరి. మునులతో వాదింప దేవతలకు సాధ్యము గలదా ? పెద్ద తడవు ప్రసంగించి చివర కేమియు నోరు మెదల్ప లేక సమాధానమును జెందక యూరకొనిరి. ఇదియే యచ్చట జరిగిన విశేషములని చెప్పుటయు గలక జెందిన డెందముతో ముకుందుం డిట్లనియె.

నారదా ! మునులకింత వివేకము లేకపోయినదేమి ? తత్వజ్ఞాన సంపన్నులును బ్రమాదము జెందుదురా! శివునికన్న న న్నల్పునిగా తలంచిరా కానిమ్ము. అట్లనిన మునులు నామంబులేమియో వాక్రువ్వుము. సురలు శాపంబులకు వెరచి తగిన సమాధానము చెప్పక యూరకొనిరి. కాని మునుల పాటి తెలివితేటలు వేల్పులకు గలిగియున్నవి. వారు కడు బుద్ధిమంతులు పనిపాటలేని ఛాందసులతో నూరక వాదించి