పుట:కాశీమజిలీకథలు-05.pdf/202

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

కాశీమజిలీకథలు - ఐదవభాగము

నేను దేవతలకును మునులకు నాపదలు వచ్చినప్పుడు సులభముగా దర్శనమిచ్చి వారి మొర లాలించువాఁడనులే! దానంజేసి వారికట్టిబుద్ధి పుట్టినది. కానిమ్ము నాన్యూనాధిక్యతలతో వారికేమిపని యున్నది. నా ప్రసంగమేల తేవలయును. ఆ మాట యడుగక పోయితివా? యని పలికిన సురయతి. తండ్రీ ? నేనెంతవాదము సేయక యేమియు నడుగక యింతదూరము వచ్చితినా! నీ యవమానము నా యవమానముకాదా! అన్నిటికిని సమాధానము చెప్పఁబట్టియే విషాదముగలిగినదిని మరియుఁ దదీయరోషాగ్ని నింధనాయమానంబులగు వచనంబులచేఁ బ్రజ్వరిల్లంజేసెను.

అప్పుడు రౌద్రావేశముతో వాణీశుండు నారదా! నీవు మరలఁబోయి దేవతలతో హరిహరులకన్న నేన యధికుండననియు మదీయ సామర్థ్యము చూడవలయునని కోరిక కలిగియుండినచోఁ జూపింతుననియు మునులు వినఁ జెప్పిరమ్ము. నేను సృష్టి జేయనిచో హరిహరులేమిచేయుదురో చూతము. గోడయుండినగదా రంగులు వేయుదురు. మందమతులన్నంతనే నేనల్పుండ నగుదునాయని నుడివిన విని మరల నమర ముని యిట్లనియె. తండ్రీ! నీతో జెప్పనేమిటికని యూరకొంటిని. కాని యట్టి తాత్పర్యము వైకుంఠునకు సైతము గలిగియున్నదిసుమీ ? ఒకనాఁడు నాతోఁ దనయభిప్రాయము వెల్లడించెను. అనుటయు నబ్జసూతి యేమీ? వాసుదేవునకు దనకంటె నేనల్పుడనని యభిప్రాయమున్నదా? దేవతలు తెలియని మూఢులనిన నందురుగాక సర్వజ్ఞుండైన దామోదరునకు స్వాతిశయబుద్ధి యేమిటికిఁ గలుగవలయును ? ఏమని ప్రశ్నించుకొనియెనో చెప్పుమని యడిగిన నారదుం డిట్లనియె

లోకేశా! నేనీనడుమ వైకుంఠంబునకుంబోయి రెండుమూడునాళులందుండి వాసుదేవు నారాధించితిని. మాకిరువురకు నాకెన్నాళ్ళు పెక్కు గోష్టులువచ్చినవి. ఆ కథలలో నీప్రస్తాపముదెచ్చి బ్రహ్మ యిట్లు చెప్పుచున్నాడని చెప్పితిని. అప్పుడయ్యచ్యుతుండు పెదవి విరచుచు బాఁడేమియెరుంగు సురజ్యేష్టోనికీ విషయము దెలియదని పలికెను ఆ మాటలలో స్వాతిశయ బుద్ధియు బరనిందా వ్యాపారము సూచించు చున్నది. అప్పుడే నా మదికిఁ గష్టముగాఁ దోచినదికాని యంతవానిముందర నేమనిన నేమి యపరాధమోయని వెరచితిని. నీవు సురలలో నధికుండవేగాని తమతో సమమైన వాడవుకావని వారి యభిప్రాయము. వారికే యట్లుండ దేవతలు మునులు నేమందురు. వారిమీద నలిగిన నేమి లాభము. అలిగిన జతుర్భుజునిపై నలిగి పంతము చెల్లించుకొనుమని పలికెను.

అప్పు డప్పరమేష్టి వత్సా ! నీవనినట్లే కావించెద. నిప్పుడు నీవు మరల వైకుంఠమునకుంబోయి నీమాటలువిని పద్మగర్భుండు చాల చింతించుచున్నాడనియు నీకంటె నేఁనేమిట దక్కువవాడనని పలికితివనియు నట్టి యభిప్రాయ ముండినం జూచుకొనవచ్చుననియు నామాటగా జెప్పిరమ్ము, మరియు మీయట్టివారి కిట్టి యల్పబుద్ధులు