పుట:కాశీమజిలీకథలు-05.pdf/201

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

207

దేశంబున లోకులలెల్లఁ గృతార్ధులం గావింపుచుంటివి. నిన్నుఁబోలిన విజ్ఞాతలేఁడు మెప్పువచ్చినది. నీకుమాత్ప్రభావం బెరిగింపం దలంచి యిట్టిమాయఁ గల్పించితి. హరి హరాదులైన మదీయ మాయామోహితులై నాప్రభావంబు దెలిసికొనలేరు. ఇందులకొక యితిహాసముగల దాకర్ణింపుము.

త్రిమూర్తుల కలహము కథ

తొల్లి నారదుం డొకనాఁడు బ్రహ్మలోకమునకుంబోయి పరమేష్టిచే సన్మానింపఁబడి సుఖాసనా సీనుండైయున్న సమయంబున విరించి నారదా! యెందుండివచ్చుచుంటివి విశేషములేవేని గలిగిన వక్కాణింపు ముబుసుపోకున్నదని యడిగిన నక్కలహశనుం డించుక యాలోచించి యిట్లనియె తండ్రీ! సకలజగన్నిర్మాణ దక్షుండవగు నీకును నుబుసుబోకుండునా! అయినను నాయెరింగినంత వక్కాణించి పని గలిగించెద నాలింపుము. నిన్ననాకములో నొకసభ జరిగినది. అందు బృందారకులను తాపసులకు త్రిమూర్తుల తారతమ్యము గురించి పెద్దగా వివాదము సంప్రాప్తించినది. అందలి సారాంశము దేవర కెరింగింప నాడెందంబు సందియమందుచున్నది.

తండ్రికైన యవమానము కుమారునికికాదా? ముఖస్తుతి వచనములచే దేవర ననేక పర్యాయములు గొనియాడినవారే వేరొక రీతిపలికిన నేమనందగునని యేమేమో సంభాషించిన నాలించి విరించి యించుక యలుక నభినయించుచు వీణాముని కిట్లనియె. పుత్రా! యధార్ధము జెప్పుటకు సందియమందెదవేల? ఏమేమి ప్రసంగము వచ్చినది. మాలోనెవ్వఁ డధికుండని నిశ్చయించిరి. అందుఁ బెద్దలెవ్వరైనఁ గలిగియుండిరా యని యడిగిన లజ్జాభయంబు లభినయించుచు దేవముని యిట్లనియె తండ్రీ! నీ యొద్దనిఁక దాచనేల అందుండవలసినవా రందరు నుండిరి చేయవలసిన ప్రసంగమంతయుం జేసిరి. అప్పుడు హరిహరుల తారతమ్యము గురించి ప్రసంగించిరికాని నీమాట యించుకయుం దేరైరి. అత్తరినుత్తలమందు చిత్తముతోనే నూరుకొనలేక హరిహరులకన్న నీవే యధికుండవని నొక్కివక్కాణించితిని.

నా మాటలువిని యందున్నవారందరు పకపక నవ్విరి. లజ్జావిషాదమేదుర హృదయుండనై యప్పుడేమియు మాటాడక తత్కృతావమానంబు వదనంబునం బొడగట్టుచుండ నట్టె లేచియందలి విశేషమేమి యేనిం గలదేమోయని యాసభముగియకుండ నీయొద్ద కరుదెంచితిని. అక్కటా! నిన్ను హరిహరులతో సమానుండనియు జెప్పరాదట. నేనిదివరకు త్రిమూర్తులు సమానులనియే తలంచుచుంటిని అందలి నిక్కువ మేదియో వక్కాణించి నాసందియము దీర్పుమని ప్రార్ధించిన విని కటమ్ములదరరోమకూపమ్ములఁ బొగలెగయభ్రుకుటీ వికటముఖుండై చతుర్ముఖుం డిట్లనియె.

నారదా! దేవసభలో దేవతలు మునులు నేక వాక్యముగా నన్నథమునిగా నెన్ని రేమి? అగునగు నతిపరిచయంబున నవజ్ఞత వచ్చునను న్యాయంబేలతప్పును.