పుట:కాశీమజిలీకథలు-05.pdf/208

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

కాశీమజిలీకథలు - ఐదవభాగము

విరించి శప్తుండయ్యె నింతియెతారతమ్యంబు కేల జక్రముబూని సంగరమునకు రమ్మని మాధవునితో జెప్పుము.

అప్పుడు మా యిరువుర ప్రభావములు దేవతలకు, మునులకు దెల్లమగునని మహా రౌద్రావేశముతో రుద్రుండు విజృంభించి పలుకుచున్నంతజూచి నారదుండు మారుమాట పలుకుటకు వెరచుచు యొదిగి యుండెను. అప్పుడు పార్వతిలేచి నమస్కరింపుచు, మహాత్మా ! యీ నారదుండు కలహప్రియుండు. ఏమేమో నాలుగుమాటలు చెప్పి పోరులు కల్పించుచుండును ఈతని పలుకులునమ్మి వాసుదేవునిపై నలిగెదరేల? నారాయణుండు దూరదర్శనుండు శాంతస్వభావు డూరక తొందరపడువాడుకాడు. కావున విమర్శించి యాగ్రహము బూనుడని స్తుతిపూర్వకముగా నుడివిన విని పినాకపాణి శాంతుండై అవును మాబోటులకవి మృశ్యకారిత్వ ముచితమైనదికాదు. నారదా! నీ వరిగి ముప్పది మూడుకోట్ల వేల్పులతో నింద్రాది దిక్పాలురతో, మునులతో బ్రహ్మతో గరుడధ్వజు నిచ్చటికి దీసికొనిరమ్ము. వెండియు సభజేయింతుము.

ఆ సభలో మేము ప్రసంగింతుము మా బలాబలములు విమర్శించి మునులును దేవతలును ప్రధానత్వము నిశ్చయింతురుగాక వేగము పొమ్మని యానతిచ్చిన విని నారదుండు పరమానందము జెందుచుం దుధరు వీడ్కొని యట గదలి —

గీ. హరిహరుల కింకనుగ్ర సంగరముగాక
   మానదురు లోకసంక్షోభ మైనఁగాని
   కడుపునిండించుకొన మంచికాలమిదియ
   నాకు నిటువంటి తృప్తి యెన్నటికిరాదు.

అని వీణంబాడుకొనుచు వైకుంఠంబునకుంబోయి దైత్యారింగాంచి నమస్కరించుటయు బీతాంబరండు మందహాసముజేయుచు, నారదా! కైలాసమున కరిగితివా ? మహేశ్వరుండు కుశలియైయున్నవాడా ? విశేషములేమని యడిగిన నమ్మునితిలకుండు మహాత్మా ! నేనిప్పుడు కైలాసమునుండియే వచ్చితిని. శంభుండు భద్రముగా నున్నవాడు. మీకు నాలుగుచేతులు గలిగియుండ నాయనకైదు మొగములును, మూడునేత్రములును గలిగియున్నవి. మీచేతచక్రముకన్న నాయన చేతనున్న శూలము బదిమడుగుల బరువెక్కువ గలిగియున్నది మీ యిరువురు నొకరికొకరు తీసిపోయెడువారు కారు. దామోదరా ! నా కిదివరకే కొండీడని వాడుకపడియున్నది. అచ్చట చేష్టలం జెప్పితినేని మీకు గోపమురాకమానదు. పిమ్మట మీ యిరువురును గలహింతురుదాన లోకసంక్షోభ మగును ప్రజలు నన్ను నిందింతురు కావున నచ్చటి నావార్తలేమియు మీ కెఱిగింపకయే పోయెద ననుజ్ఞ యిమ్మని కోరిన నారాయణుండు నవ్వుచు నిట్లనియె.

నారదా! ఒరులన్న మాటలు చెప్పుటచే నీకేమీ తప్పుగలదు. అదియునుం గాక మదీయ సందేశముమీదనేకాదా నీవు కైలాసమునకుఁబోయితివి. తిరిగివచ్చి యచ్చటి వార్తల జెప్పకపోవునా ? నీకేమియుఁ గొదువలేదు. జరిగిన కథయంతయుం జెప్పుమని