పుట:కాశీమజిలీకథలు-05.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

204

కాశీమజిలీకథలు - ఐదవభాగము

శ్రీరస్తు

కాశీమజిలీ కథలు

55 వ మ జి లీ

అష్టమోల్లాసము

క. శ్రీకళ్యాణ నికేతన
   లోకానీకస్తుతా ఘలుంటాకాభి
   ఖ్యాకలిత విబుధజన ర
   క్షాకల్పక సుకృతిశరణ కరుణాభరణా.

దేవా ! యవధరింపు మట్లమ్మణి సిద్ధుండు శిష్యునకు శ్రీ శంకరాచార్య చారిత్రమంతయు నెఱింగించి వెండియు నిట్లనియె. వత్సా! యమ్మహాత్ముని గురించి చెప్పికొనెడు కథావిశేషములు కొన్ని గలవని గ్రంథస్థములు కాకపోయినను లోకంబున ప్రఖ్యాతముగా చెప్పుకొనుచుండిరి. వారినెల్ల వివరింతు సావధాన మనస్కుండ వై యాకర్ణింపుము.

మహాశక్తిని గురించి జరిగిన కథ

శ్రీ శంకరాచార్యుండు శాక్తమత ఖండనము గావించిన కొన్ని దినంబుల కొకనాడు శిష్యులతో గూడుకొని యొక యరణ్యమార్గంబున నరగుచుండెను. యా మానవశేష దివసంబున నడుచుచుండెడి యాశిష్యబృందమునకు గమన శ్రమవాయ హాయిగా నప్పుడొక గాలి వీవ దొడంగినది. అందులకు సంతసింపుచు నయ్యంతేవాసు లెల్ల గురుతల్లజుని పాదపల్లవముల ననుసరించి నడుచుచున్నంత నమ్మందమారుతంబు గ్రమక్రమంబున నభివృద్ధినొందుచు నాకులు రాలునట్లు కొమ్మలు విరుగునట్లు మొదళ్లు కదులునట్లు కొండ లెరుగునట్లు విసరఁ దొడంగినది శంకర శిష్యులెల్లరు నయ్యకాండ ప్రళయమునకు వెరచుచుఁ గొంతసేపు ధూళి కలుషితములగు నేత్రంబుల జేతులు గప్పికొని మ్రాకుల మూలముల నొదిగియుండియు గొమ్మలు విరిగి మీదబడిన జడియుచు బయళ్ళకు బోవుచు నందు బెనుగాలిం గాళులు నిలువలేక కొట్టికొని పోవుచుం జెట్టుమొదళ్ళం గౌగలించుకొని --- బ్రయోజనంబుగానక వానితోగూడా దూదిపింజల