పుట:కాశీమజిలీకథలు-05.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

205

వలె నెగిరిపోవుచు 'హా! శంకరా! గురువరా ! రక్షింపుము. రక్షింపుము.' అని మొరలిడ దొడంగిరి.

శిష్యజనుల పరిదేవనము జూచియు వారింపనోపక విచారించుచు శంకరుండు తానును జంఝావాత ఘాతంబున శిష్యజనుల కెడమై పెద్దదూరము కొట్టికొనిపోయెను. అతండు వంగి నేలంట బండికొనుచు జేతులకు దొరకిన వానిం గట్టిగ బట్టుకొనుచు నానక వారితోగూడ నెగసిపోవుచు నీరీతి బోయిపోయి మొకచో సజఁ బాలంబైన నేలం బడి యాబురదలో దన రెండుపాదంబులును మొలవరకుం దిగబడుటయు గదలకచేతులాకర్దమము పైనాని నిలువంబడి యుండెను. ఎంత వడిగా విసరినను వడముడి యమ్మహాత్మునందుండి యించుకయు గదల్పలేకపోయెను.

సీ. కనకామలకవృష్టి గలిగించి విప్రకా
          మినినెవ్వ బాపిన మేటితనము
    పూర్నానదినిటెంకి పొంతకు రప్పించి
          జనుల మెప్పించిన సాహసంబు
    మూకాంబి కాగేహమున గతాసునిభూసు
          రార్భకు బ్రతికించి నట్టిశ క్తి
    మిన్నంటఁ బొంగి భూమినిముంచునర్మదా
          ధునిఁ గుంభముననిమిడ్చినమహత్వ.

గీ. మెందడంగెనొయేమూల కేగెనొక్కొ
   భవమహా పంకమునగూలఁ బడెడుజడుని
   పగిదిశంకరు దమ్మహా పంకమందు
   గాలు గదలింపలేక చీకాకునొందె.

ఆహా! కాలంబెంత వారినైన వగ్గము జేసికొనక మానదు. క్రమంబున నాగాలి చల్లారినవెనుక నమ్మహాత్ముండా కర్దమమునుండి యీవలకు రావలయునని యెంతయో ప్రయత్నము జేసెను కాని లాభమేమియు లేకబోయినది. కరపాదంబు లేపనికిని బ్రసరింపఁజేయుటకు శక్తియుడిగినది. క్రమంబునఁ గాయంబా బురదలోనికిఁ దిగిపోవ దొడంగినది. బెండుపడిమేనం బ్రాణములు నిలుచుట గష్టముగా దోచినది అప్పుడమ్మహాత్ముండాలోచించి యోహో ! మోహావేశంబునంజేరి నేనిట్టి యిక్కట్టు జెందితిని. కానిచో విలయంబునఁగాక నెన్నఁడైన మనుష్యుల నెగరజిమ్మెడు తెమ్మరలు వీచునా ? మదీయాంతస్సారమిట్లు బెండువడుట చిత్రముగానున్నదే. అక్కటా ! నే దెలియక నేదేవతకైన నపచారము గావించితినాయేమి? యూరక యిట్టి యుపద్రవము తటస్తించునా యని యాప్రాజ్ఞుండు పెక్కు తెరంగులఁ దలంచుచుఁ గన్నులు మూసికొని చేదోయిఫాలంబునఁ గీలించి,