పుట:కాశీమజిలీకథలు-05.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

కాశీమజిలీకథలు - ఐదవభాగము

గీ. చంద్రధరుఁ డాత్మపదవారిజములనుండి
   కలుగఁజేసెను తప్తోదక స్రవంతి
   బరగఁ జాటింపుచున్న దిప్పటికి గురుని
   మహిమనటదప్తతో యయన్ లహరియొకటి.

తచ్ఛిష్యులెల్ల దప్తోదకంనది గృతావగాహులయి శీతబాధం బొరయక కృతకృత్యులయి జగద్గురు ననేక ప్రకారములు నగ్గించిరటుల శంకరయతి సార్వభౌముండు ముప్పది రెండేడులలో బుడమియంతయుం గృమ్మరి కుమతవాదులనోడించి యద్వైత జ్ఞానరత్నంబు లెల్లడ వెదజల్లి సుజ్ఞానప్రతిబోధకములగు ప్రబంధములు వేనవేలు రచించి సురేశపద్మపాదహస్తామలక తోటకాచార్యుల నలువురు నాలుగు దెసలం బొలుపొందు శృంగేరి ప్రముఖ మఠంబుల బీఠాధిపతులుగ నొనరించి కృతార్ధుండయి కేదారంబున మహామునులతో గొన్ని దినములు సద్గోష్టి గాలక్షేపము జేయుచుండె. మరియు

గీ. స్వహితపరుడుగాక సన్యాసియై చిన్న
   తనమునందె సర్వ ధనమువిడచి
   దెసలదిరిగి జ్ఞానరసము నిండించిన
   యతడు దేవుడనుట యబ్బురంబె.

సీ. కావించెఁగైవల్య ఘంటాపదములైన
         భాషాదిభూరి ప్రబంధములను
    వెలయించె నద్వైత విద్యావినూత్న మా
         ర్గంబుర్వినిష్కంటకంబుగాగ
    స్థాపించె బుడమి నష్టాదశ పీఠంబు
         లందాదిశక్తుల బొందుపడఁగ
    వాదించెబౌద్ద చార్వాకాదికుమత వా
        దులదోడ దుష్క్రియల్ దొలఁగునట్లు

గీ. కీర్తిమీరఁగ నద్భుత క్రీడితముల
   వెరగుపడఁజేసి దిక్కులఁ పరమ బోధ
   నాప్తులఁ గృతార్థులుగజేసె యతికినింక
   జేయఁ దగినట్టి పనులేమొ చెప్పరయ్య.

అట్లు ధ్వాత్రింశత్సంవరంబులు పరిపూర్తినొందిన యనంతరంబ.

చ. హరి పరమేష్టి నాకవిభుఁ డాదిగగల్గు సమస్తదేవతా
    వరులు వియచ్చరుల్ ప్రమధ వారము సిద్ధులువచ్చి యప్పు డం
    బరమురురత్న కాంచన విమానపరిష్కృతమై యొసంగ నిఁ
    ర్జరతరుపుష్పవృష్టి బెలుచం గురిపించుచుఁ బల్కిరల్లనన్.