పుట:కాశీమజిలీకథలు-05.pdf/195

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

201

లేదుగదా ? కావునందదంగనా సంగమ కళంకము నాకు దోషమునకుగాదని శాస్త్రప్రమాణము జూపగలను. ఇప్పుడేమి చెప్పెదవని యడిగిన విని యప్పలుకు వెలంది సమ్మతించినటుల ప్రశంసింపుచు నేమియు బలుకక యూరకుండెను.

అటుల సరస్వతియు బండితులును గొనియాడుచు బీఠారోహమున కంగీకరించి రంత శంకరాచార్యులు వినోదముగ సర్వజ్ఞపీఠారోహణము గావించి గార్జ్యచేతను కహోలప్రముఖులగు మునులచేత గొనియాడబడిన యాజ్ఞవల్క్యుండుబోలె మిక్కిలి విరాజిల్లె. నట్టిసమయంబున -

క. గురునాధు శిరముపైని
   ర్జరవరులంబరమునుండి సంతానసుమో
   త్కరవర్షంబులు గురిపిం
   చిరి దుందుభిరవములపుడు చెల్వుగ మ్రోయన్.

అటుల శంకరాచార్యులు స్వాభిమానమునకుగాక స్వమతాధిక్యతకొరకు సర్వజ్ఞ పీఠం బధిష్టించి యందు గొన్ని దినంబులుండి తన శిష్యులలో నొకనిని తత్పీఠాధికారిగా నొనరించి యచ్చటనుండి బదరికారణ్యమునకు జనియెను.

క. చని యయ్యతిపతి బదరీ
   వనమున దపమాచరించు బ్రహ్మర్షులకున్
   దనసూత్రభాష్యమల్లన
   వినిపించుచు గొన్నినాళ్ళు వేగించెనటన్.

గీ ఆపదుద్ధారక మఘ సంహారకంబు
   తాపవారక మర్థి మందారకంబు
   జేరె జనితారకంబు కేదారకంబు
   శిష్యసంయుక్తుడై యతిశేఖరుండు.

మ. అతిశీతంబున నార్తినొందుచుఁ దదీయచ్ఛాత్రులచ్చో సహా
     యతివర్యా! చలి నిల్వలేమిచట దేహంబు ల్వణకెం బ్రతీ
     కతతుల్ముద్ధగుచున్న విప్పుడయయో! కావంగదే శీత బా
     ధితులన్మమ్ము దయానిధీ! యనుచుఁ బ్రార్థింపంగృపార్థాత్ముఁడై.

క. సకల జగదీశుశిశు చం
   ద్రకలా శేఖరు భజించి తద్ధరనా తీ
   ర్థకర ప్రముంఖుడుష్ణో
   దకముం బ్రార్థించే శిష్య తతిరక్షింపన్.