పుట:కాశీమజిలీకథలు-05.pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

కాశీమజిలీకథలు - ఐదవభాగము

అట్లు శంకరయతి సార్వభౌముండు భూమండలమెల్లఁదిరిగి కుమతకంటక లతావితానంబుల నున్మూలించి యాత్మీయయశోవసరాంకురముల నాటించి సర్వజనులద్వైతమతావలంబకులం గావించి విరాజిల్లుచున్న సమయంబున నభినవగుప్తుండు వెనువెంటఁ దిరుగుచు తదుచ్ఛ్రయముఁ జూడనోపక రహస్యముగా నాభిచారిక హోమముఁ గావించి వైద్యులకు మానుపశక్యముకాని భగందరరోగమానిస్సంగు నకు జనించునట్లు ప్రయోగముచేసి యామాంత్రికుం డెందేనింబోయెను.

అమ్మరునాఁడే యావ్యాధి యమ్మహాత్మునిఁ బీడింపఁ దొడంగినది. సంతత శ్రోణీతస్రావంబున శాటీపటంబు పంకిలంబగుటఁజూచి తద్వస్త్రంబు లుదుకుతోటకాచార్యులు పరితపించుచు నత్తెఱంగు పద్మపాదాదిశిష్యుల కెరింగించెను.

అప్పుడయ్యంతేవాసులెల్ల జింతాక్రాంతస్వాంతులై విలపించచు దద్బాధం బరిగణింపక యుపేక్షించియున్న గురువరుం బ్రార్థించి తదనుమతిఁ బెక్కండ్ర రాజ వైద్యులం దీసికొనివచ్చి చికిత్సలం జేయించిరి. కాని యించుకయు బ్రయోజనము లేక పోయినది. తద్వ్యాధికృతంబగు పరితాపంబు క్రమంబునఁ బ్రబలుచుండుటఁజూచి యాచార్యుండు సకలార్తహరుండగు పురుహరు భక్తివివశుండై స్మరించెను.

భక్తజనవత్సలుండగు వృషభరంగుండు కరుణాపూరితాంతరంగుండై తద్వ్యాధి మాన్ప నశ్వినీదేవతల నాయనయొద్ద కనిపెను. ఆ దేవవైద్యులు బ్రాహ్మణ వేషంబులతో వచ్చి తచ్ఛిష్యులచే నర్చితులై యారోగము పరీక్షించి యోహో! యీ వ్యాధి శాక్తికప్రయోగమువలనం జనించినది. చికిత్సకు సాధ్యమైనదికాదు. ప్రయోగమునకు ప్రతిప్రయోగమే వైద్యమని చెప్పి యాసురవైద్యు లరిగిరి.

అప్పుడు పద్మపాదుండు ముప్పిరిగొను కోపముతో నోహో మదీయ గురు నట్లు రోగపీడితునిఁ జేసిన పాపాత్ము నిప్పుడే ముప్పు నొందించెదఁగాక. అయ్యో! దీని ప్రవృత్తి దెలిసికొనలేక యిన్నాళ్ళుపేక్ష గావించితిగదా; ఈ సాధుశిరోమణి నిష్కారణమట్లు బాధించిన క్రూరుని శిరము నూరువ్రక్కలు చేయకుందునాయని చింతాక్రోధంబులు హృదయంబునవేధింప నప్పుడే నియమము వహించి స్వాభీష్టదేవత యైన నారసింహదేవుని సమంత్రముగా నారాధించెను.

తదారాధనా విశేషంబునం జేసి యమ్మరునాఁడే యభినవగుప్తుఁడారోగము చేతనే పీడింపఁబడి హతుండయ్యెను. శంకరాచార్యులును స్వస్థులైరి. బుద్ధిపూర్వకముగా మహాత్ముల కపకారము గావించినవాఁడు చెడిపోవక సుఖించునా !