పుట:కాశీమజిలీకథలు-05.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

193

అభినవగుప్తుడు - శిష్యులారా! శంకరసన్యాసి యిప్పుడు మన గ్రామము వచ్చి యాలయములో వసియించి యున్నవాఁడఁట. వాదమునకు రమ్మని యిప్పుడే పిలిచిపోయెను, ఏమి చేయవలయును.

శిష్యు - శాక్తభాష్యము రచించి జగత్ప్రసిద్ధి వహించిన ధన్యుఁడవు. ఆ సన్యాసి నిన్నేమిచేయఁగలఁడు. నీపేరువినినంత నీదేశవాస్తవ్యులెల్ల జడియుచుందురే. అట్టినీవాతనితో వాదించి గెలుపుగొనుట యేమి యాశ్చర్యము !

అభినవ — అతండు సామాన్యుడుకాఁడు భట్టపాదమండనమిశ్ర నీలకంఠ భాస్కరాది పండితులనోడించి దిగ్విజయము చేయుచున్నాఁడు. నేనకాదు. వేదాబ్జబాల భాస్కరుండగు నామస్కరీంద్రునితో సమముగా వాదించు పండితుడీ మూడులోకములలో లేఁడు.

శిష్యులు — అయ్యో యీదేశమున మనకుఁగల ప్రఖ్యాతి చెడిపోవుచున్నదే. ఇఁక మనలను మన్నించువారెవరు? భవదీయ మంత్రశక్తి యంతయు వృథగాఁ బోవలసినదే?

అభినవ — అట్లుచేసిన లోకాపవాదవహింతుము. కపటోపాయంబున లోక కంటకుండైన వీనింబరిమార్చుట యుచితము మదీయ మంత్రసామర్ధ్యంబుజూతురుగాక యతనికి శిష్యుఁడనై వెనువెంటఁదిరుగుచుఁ బ్రాణంబులం గ్రోలెదను. ఈ మాట హృదయంబుల నుంచుఁడు.

అని యాలోచించుకొని యభినవగుప్తుండు శిష్యునితోఁగూడ శంకరాచార్యు నొద్దకరిగి దదీయపాదంబులంబడి మహాత్మా! నేనభినవగుప్తుండ. నిప్పుడు నీకుఁ బ్రియ శిష్యుండనైతి. నీ ప్రభావము లోకాతీతమైనదానిఁగా వినుచుంటిని. భవదీయదర్శనాభి లాషినై యున్నవాఁడనేఁగా కృతార్ధుండనైతినని యనేక ప్రకారముల వినుతించెను.

అప్పుడాచార్యులు ఓహో అభినవగుప్తా ! నీ ప్రఖ్యాతిఁజాల దూరమునుండి వినుచుంటిమే. ఏది నీవు శాక్తభాష్యము చేసితివఁట వినిపింపుమనుటయు నతండు, స్వామీ! చంద్రుఁడులేని సమయమునఁగదా నక్షత్రములు ప్రకాశించునవి. భవదీయ భాష్యార్కబింబము వెలుగుచుండ క్షుద్రగ్రంథాంధకారంబులు నిలువఁబడునా ? నా భాష్యము దేవర చూచుటకుఁ దగదు వినేయుని శిక్షింపుడని వేఁడుకొనియెను.

తృణచ్ఛన్నకూపమగు నద్దురాత్ముని కపట మెరుంగక శంకరాచార్యులు శిష్యునిగా నంగీకరించి యతండు తొడరా మరియు నంగవంగ కోసలాదిదేశముల కరిగి యందుగల కుమతంబుల ఖండింపుచుఁ గ్రమంబున గౌడదేశమునకుం బోయిరి.

అందుఁ బ్రసిద్ధులైన మురారిమిశ్ర ధర్మగుప్తమిశ్రోనయనాది పండితుల నుద్దండవాదంబున నోడించి తనకీర్తి వారిచేఁ గొనియాడింపఁజేసెను.