పుట:కాశీమజిలీకథలు-05.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

192

కాశీమజిలీకథలు - ఐదవభాగము

క. పలుపలుకులేల నీకే
   తెలియఁబడుగావె తత్సుధీవరు విద్యా
   బలముదినుచు రుచులడుగఁగ
   వలయునె వడిలేచి భట్టభాస్కరా! రమ్మా !

అని యత్యంతావహేళనపూర్వకముగాఁ బలికిన భట్టభాస్కరుండౌరా ? యెంతెంతమాటలాడుచుంటివి. పోపొమ్ము. మేము వచ్చుచున్నామని శిష్యులతోఁగూడ శంకరాచార్యు నొద్ద కరిగెను.

పిమ్మట భాస్కరమస్కరి ప్రవీరులిరువురు వాదమునకుఁ బూనికొని వీరాలాపములాడుకొనుచు నొండొరుల నాక్షేపించుకొనుచు వాక్యచాతుర్యంబులం జూపుచు సకలశాస్త్రప్రవీణతఁల గాన్పించుచు యుక్తిపాటవంబులఁ దేటపరచుచు నన్యోన్యమత ఖండనంబులఁ గావించుచు మతాంతరంబు నిందించుచుఁ బ్రకృతిపురుషుల భేదమును గురించియు జీవేశ్వరుల యభేదమునుగురించియు మూడహోరాత్రంబు లేకరీతిఁ బ్రసంగము గావించిరి.

అందు భట్టభాస్కరుని ప్రౌఢవాక్యములతోవిదానంబులు పెనుగొనంగ యతి పురందరుండు యుక్తికౌక్షేయకముల ఖండింపుచు నుద్దండపాండిత్యప్రకర్ష తేటపడఁ గ్రమంబున నతని నిరుత్తరం గావించెను.

అట్లు యుక్తిశతములచే భట్టభాస్కరుని వశపరచుకొని శంకరయతి సార్వభౌముండు శ్రుతిభావవిరోధములగు విమతగ్రంథముల నెల్లను న్యూలించెను.

దుర్మతవాదియగు భట్టభాస్కరుండట్లు శంకరునిచేఁ బరాజితుండగుట విని తద్దేశవాస్తవ్యులైన బాణమయూవాది పండితులాచార్యు నాకర్ణించి యనుమోదించి శిష్యత్వము వహించి యరిగిరి.

పిమ్మట నమ్మహాత్ముండు బాహ్లికదేశమున కరిగి యందుంగల కుమత వాదుల ఖండించి యనంతరము నైమిశారణ్యముకరిగి యందుఁగల తాపసుల కామోదముఁ గలుగఁజేసెను.

తరువాత నాపరివ్రాట్సేఖరుండు దరదభరత శూరసేన కురుపాంచాలాది దేశములకరిగి యందుఁగల పండితులనోడించి తనభాష్యమును వ్యాపకముచేయుచుఁ గ్రమంబున ఖండనకారుండగు శ్రీహర్షు నొద్ద కరిగెను. అప్పండితుండు ప్రభాకర భట్టపాద భట్టభాస్కరాది నూరివరేణ్యుల లెక్కగొనకఁ గర్వించియున్నమేటి. అట్టి ఖండకారుని బటుయుక్తి పరంపరలచే నూచియూచి వశంవిదునిగాఁ జేసికొని యయ్యతి చక్రవర్తి యచ్చటనుండి కామరూపములను దేశవిశేషములకరిగి యందు శాక్తభాష్యము రచియించి ప్రసిద్ధినొందియున్న యభినవగుప్తుఁడను పండితుని వాదమునకుఁ జీరినంత నతండాత్మీయ శిష్యులతో నిట్లని విచారించెను.