పుట:కాశీమజిలీకథలు-05.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

189

నల్ప తేజఃపుంజంబున రెండవ శంకరునివలె నొప్పు శంకరుంగాంచి విస్మయహృదయుఁడై వాదసన్నద్ధుండై యున్న సమయంబున సురేశ్వరుం డాచార్యున కిట్లనియె.

స్వామీ! మీరు క్షణకాలము విశ్రమింపుఁడు. ఈ నీలకంఠుఁడు మించినవాఁడుకాఁడు. వీనిం ద్రుటిలో బరిభవించి యంపెద. మదీయ వాదశక్తిఁ జూతురుగాక యని పలికిన విని నీలకంఠుం డీసుతోఁ జురచురం జూచుచు సురేశ్వరున కిట్లనియె.

అయ్యారే ! సురేశ్వర ! లజ్ఞావిహీనుండవై యీ సభాముఖంబునఁ దలయెత్తి యెట్లు సంభాషింపు చున్నావో విచిత్రమగుచున్నది. సన్యాసితో వాదించి తానోడుటయేకాక భార్యనుగూడ సభ యెక్కించియు గెలుపుఁగొనక దాసుండవై యతని వెంటం దిరుగుచున్న నీవా నాతో వాదించుట ? ఏమి నీయద్వైతనిష్ఠత. మొన్నటివఱకుఁ గర్మవాదివై బలవంతమున సన్యాసి వైతివి. పోపొమ్ము. నీవు సంభాషణార్హుండవుకావు. రెంటికిం జెడితివని పలుకుచు శంకరున కభిముఖుండై నిలువఁబడియెను.

అప్పుడయ్యతిపుంగవుం డోహో ? నీలకంఠా ! నీవీ సురేశ్వరుని ప్రజ్ఞ యెఱుంగక చులఁగఁదూలనాడితివి. కానిమ్ము. నీకే విద్యయం దభిమానమో చెప్పుము. నీవు వ్యాససూత్రములకు శివపరముగా భాష్యము జేసినావఁట యేదీ నీ భాష్యము చూచి యభినందింతుమని పలికిన విని నీలకంఠుండు తన భాష్యమును చదివి వినిపించెను.

అప్పుడు శంకరాచార్యుండు పరపక్షబిసావళీ మరాళంబులగు వచనంబులచే నతనిభాష్యమును శతధాఖండించి యతనిచేతనే దానినిఁ బూర్వపక్షమైనదానిఁగా నొప్పించెను.

అప్పుడు నీలకంఠుండు స్వపక్షరక్ష జేసికొనలేక చింతించుచు శంకరకృత మగు సూత్రభాష్యము నిట్లు పూర్వపక్షము చేయఁబూనెను

యతీంద్రా ! మీరు తత్త్వమస్యాది నగమాంత వచనములచేఁ దేజస్తిమిరములకుంబోలె విరుద్ధధర్మములుగల జీవేశ్వరులకైక్యమును జెప్పుచుందురు. అది యసంగతము.

మూఢత్వాదిగుణవిశిష్టుండగు జీవుండు సర్వజ్ఞత్వాది గుణ సమంచితుండగు నీశ్వరుం డగుట యెట్లు ? ఇది శుద్ధావివేకము. అద్వైతము బౌద్ధమతమువంటిది.

అని యిట్లనేక యుక్తిప్రయుక్తులచే నద్వైతసూత్ర భాష్యమును బూర్వ పక్షము సేయుటయు నవ్వుచు శంకరాచార్యుం డిట్లనియె.

నీలకంఠా ! నీ యకుంఠితపాండిత్యప్రౌఢిమ యంతయు దేటపడినది. మదీయ భాష్యము సురేశ్వరుని యొద్దఁ బాఠముఁ జదువుకొనిన నీకు మంచిబుద్ధి గలుగును. ఇంతకన్న బ్రౌఢములైన పూర్వపక్షముల ద్వైతమతముపై జేయబడినవి. వాని కన్నింటికి సమాధానములు సైతము చెప్పియుంటిమి. తత్పూర్వపక్ష సిద్ధాంతము లన్నియు మా భాష్యమున దేట తెల్లముగా వ్రాయఁబడియున్నవి. అవి యన్నియు నీవు చదువుకొనుము. చక్కగాఁ దెలియగలవు. జీవేశ్వరుఁ కు వాచ్యార్థముచే విరుద్ధధర్మ