పుట:కాశీమజిలీకథలు-05.pdf/182

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

కాశీమజిలీకథలు - ఐదవభాగము


శ్రీరస్తు

కాశీమజిలీ కథలు

54 వ మజిలీ

సప్తమోల్లాసము

అందు మహాకాళనాధు సేవించి తదాలయమున వసియించియున్న సమయంబున హరదత్తుండనువాడు శిష్యులకు వేదాంత ముపదేశించు నీలకంఠుండను తన గురువునొద్దకు జని యల్లన నిట్లనియె.

నీలకంఠుని కథ

ఆర్యా! నీవు వ్యాససూత్రములకు శైవపరముగా భాష్యము చేసియుంటివి. ఇప్పుడు శంకరుండను సన్యాసి భట్ట మండనాది ప్రౌఢ పండితులం జయించి శిష్యులగా జేసికొని వారితోఁగూడ దిగ్విజయము చేయుచు నిన్ను జయించు తాత్పర్యముతో నీయూరుచేరి మహాకాళుని యాలయములో వసియించియున్నాడఁట. అతండు అద్వైతపరముగా సూత్రభాష్యముఁజేసి దేశమెల్లెడల వ్యాపకము చేయుచున్నాడుఁట ఇప్పుడు మనసూత్రభాష్యమును ఖండించుననియు వాదమునకై రప్పింప వలయుననియుఁ దచ్చిష్యుఁ డొక్కడు నాతోఁ జెప్పినాఁడు వానిశిష్యులే లోకాతీతులని వింటిని. తరువాతి కృత్యము మీరే యోచించుకొనుడని పలికిన విని శైవాగ్రేసరుఁడైన నీలకంఠుం డిట్లనియె.

హరదత్తా! నీవిట్లు పిరికితనముగా మాట్లాడుచున్నావేమి? నా సామర్ధ్యము మఱచితివా? పరపక్షార్కములైన తర్కములచే నిప్పుడే వాని వివశుం గావింపుచుండ నీవే చూతువుగా వినుము.

శా. పారావారజలంబులెల్ల గడు దర్పంబొప్ప నింకింప నీ
    ధీరుండై దివినుండి భాస్కరుని ధాత్రింద్రెళ్ళద్రొబ్బింప నీ
    ధారాళంబుగ నాకసంబు నురువస్త్రంబట్లుకైఁజుట్ట నీ
    సారప్రజ్ఞుననుంజయింప యతికిన్ శక్యంబుగా దెన్నఁడున్.

అని బీరములు పలుకుచు నత్యంతకోపాటోపంబున బయలుదేరి రుద్రాక్ష మాలికావిరాజితకంఠుండై నీలకంఠుండు శిష్యులతోఁగూడ శివాలయంబున కరిగి యంద