పుట:కాశీమజిలీకథలు-05.pdf/181

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

187

శూన్యముకాని యట్లు స్పష్టపడలేదా? మూఢత్వమును విడచి యద్వైతవిద్యను గ్రహింపు మని పలికిన విని వాఁడు మఱల నిట్లనియె.

స్వామీ! ఖంబ్రహ్మా॥ అను శ్రుతివలన ఆకాశమే బ్రహ్మయని విశదమగు చున్నయదిగదా!

శ్లో॥ ఆకాశస్సర్వభూతేషు జ్యాయాన్సోస్తిపరాయణం
     తంప్రత్యేవా స్తమాయాంతీత్యేవంహిశ్రుతిరబ్రవీత్॥

సర్వభూతములలో ఆకాశమే శ్రేష్ఠమైనది. తచ్చిహ్నముగలదగుటచే ఆకాశమునకుఁ బ్రహ్మత్వము చెప్పుచున్నాము. కావున మామతము నింద్యమెట్లగును? అనుటయు జగద్గురుండు. ఓహో! శబ్ధిగుణకమాకాశమని వినియుండలేదా ? సగుణమును బ్రహ్మమునుగాఁ జెప్పవచ్చునా? కార్యకారణబోధకమైయున్నది. కావున శబ్దమువలన దెలియబడుచుండెడి యాకాశము బ్రహ్మముకానేరదు. ఎవ్వనికిని నాకాసాదులకంటె నాధిక్యము వేదమందుఁజెప్పబడినదో యట్టి సచ్చిదానందస్వరూపమైన పరమాత్మ నద్వైతబుద్ధితో దెలిసికొనుము ముక్తుండవయ్యెదవని పలికిన విని యాశూన్యవాడి యమ్మహాత్ముని బాదంబులంబడి ఆర్యా! భవద్దర్శనంబునఁ గృతార్జుండనైతి. మూఢుండ నైన నన్ను బ్రహ్మోపదేశంబునఁ గృతార్థుంగావింపుమని వేఁడుకొనుటయు నతండు వానిని శిష్యునిగాఁ జేసికొనియెను.

ఆ రీతినే యయ్యతిపతి వరాహసాంఖ్యకాపిలాణుక శేషచంద్ర పితృమతస్థులఁ దత్తద్దేవతారాధకుల సద్వైతబోధచేఁ గృతార్థులం గావింపుచు నరిగియరిగి పశ్చిమ సముద్రతీరంబున విరాజిల్లుచున్న గోకర్ణక్షేత్రమున కరిగెను.