పుట:కాశీమజిలీకథలు-05.pdf/180

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

186

కాశీమజిలీకథలు - ఐదవభాగము

అట్లు శంకరాచార్యులు కర్ణాటదేశంబునఁ బ్రబలియున్న కాపాలిక చార్వాక జైనాది కుమతంబుల ఖండించి యందుండి శిష్యులతోఁ గూడ ననుమల్లమను పట్టణమున కరిగిరి.

అందు మల్లాసురహరుండగుట మల్లారియను పేరుతోనున్న వేల్పుంపూజింపుచు నందున్నవారు తద్వాహనమైన కుక్కల ననుదినము సేవింపుచుందురు. వారు గవ్వలపేరుల గంఠంబుల దాల్తురు. మూడుకాలములయందును నాట్యవాద్యాదికములచే నా మల్లారి నర్చించుచు నతఁడే ముక్తిప్రదుండని వాదింపుచుందురు.

శ్రుతి॥ శ్వభ్యశ్శ్వపతిభశ్చవోనమః॥ అను శ్రుతివలన శ్వాసములె వందనీయములని ప్రమాణములు చూపుదురు. శంకరాచార్యులాగ్రామమున నిరువదిదినములు వసియించి తన్మతమును ఖండించి వారినెల్ల ప్రాయశ్చిత్తపూర్వకముగా సన్మార్గ ప్రవర్తకులఁ గావించెను.

పిమ్మట నగ్గురువరుండు శిష్యసహితముగా నచ్చటినుండి పశ్చిమ మార్గమున నరిగి మరుంథ మను గ్రామమునకరిగెను. అందు విచిత్ర గోపురమండితంబైన విష్వక్సేనుని యాలయమొకటి గట్టించి దానికిఁ దూరుపుగాఁ బానీయశాలను నిర్మించి యాచార్యుండా యాలయములోనికింజని స్వామిని సేవించెను.

మరియు నందు గల విష్వక్సేన మతస్థులకు సాధుబోధగావించి పాషండ చిహ్నశూన్యులంగావింపుచు నాత్మభక్తులంజేసికొనియెను. అచ్చటనుండి యుత్తరమార్గముగా మాగథమను పట్టణమునకరిగి యందు నింద్రకుబేరమతస్థుల యజ్ఞానంబుఁ బోగొట్టి పంచపూజాపరాయణులం గావింపుచు శంకరుండచ్చటినుండి యమప్రస్థపురంబున కరిగెను. అప్పురంబున మాసము వసించి యందు యమతస్థులఁ బాదాక్రాంతులం గావించుకొని కృతార్థులంజేసి పిమ్మట నచ్చటనుండి ప్రయాగ కరిగి యందు వాయు వరుణ మతస్థుల వినేయులం జేసికొని కొన్నిదినములు వసియించి త్రివేణీతీర్ధ సేవ గావింపుచుండెను.

అందొకనాఁడు శూన్యవాడి శంకరాచార్యు నెదుటకువచ్చి నిలువంబడుటయు నాజగద్గురుండు నీవెవ్వండవని యడిగెను అప్పుడు వాఁడు స్వామీ! నేను నిరాలంబన నామధేయుఁడ. మాతండ్రిపేరు క్లుప్తుఁడు. నేనిప్పుడు వచ్చుచుండ దారిలో మృగతృష్ణా జలంబున స్నానముఁజేసి యాకాశకుసుమ మాలికలం జుట్టికొని శశశృంగవిరచితమగు కోదండంబుధరియించి వంధ్యాపుత్రుండొకఁ డెదురుపడియెను. వాని జూచి సంతసించుచు దేవభావము వహించి నమస్కరించి యిప్పుడే తమదర్శనముఁ గావింపఁజనుదెంచితిని. వాడెవ్వఁడో యెరింగింపుడనుటయు శంకరాచార్యు లిట్లనిరి. శూన్యవాదీ! నీ యభిప్రాయము నే నెరుంగుదును. శూన్యమగుట నీమతము నింద్యమైయున్నది.

శ్రుతి॥ తమేన భారతమను భాతిసర్వం॥ అను శ్రుతివలన బ్రహ్మము