పుట:కాశీమజిలీకథలు-05.pdf/184

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

190

కాశీమజిలీకథలు - ఐదవభాగము

ములు గలిగియున్నవి. కాని లక్షణార్ధముచే లేవు. చిత్స్వరూపదాసామ్యంబున నిరువురకు నభేదమే చెప్పదగినది. పెక్కులేల? నీ శంకలన్నిటికి మామక భాష్యమందే సమాధానము చెప్పఁబడియున్నది. సురేశ్వరా ! వినుపింపుమని పలికిన నప్పండితుండు భ్రూభంగవిక్షేపంబున నతని నాక్షేపించుచు నందుఁగల పూర్వపక్ష సిద్ధాంతములన్నియు నీలకంఠునికిఁ జదివి వినిపించి చక్కగా బోధించెను.

అప్పుడు నీరకంఠుఁడా భాష్యమును విని సిగ్గుపడి గర్వముతో గూడఁ దనభాష్యమును విడిచి శంకరాచార్యుని చరణసరసిజముల శరణుఁ బొందెను.

అట్లు శంకరాచార్యులు నీలకంఠుని జయించిరనువార్త విని యద్వైతమత విరోధులగు నుదయనాదిపండితులు భయపడి విదేశములకుం బాఱిపోయిరి.

పిమ్మట శంకరాచార్యులు సౌరాష్ట్రాదిదేశముల కరిగి యందందు దన భాష్యమును వ్యాపకముఁ జేయుచు విబుధ ప్రశస్యమానుండై ద్వారవతీపురి కరిగెను.

అందుఁ బాంచరాత్రులను వైష్ణవమతవిభేదులు దప్తశంఖచక్రాకృతి వ్రణపూరితావయవులరై యొప్పుచుందురు. వారెల్ల స్వమతాధిక్యమును బ్రతిష్టించు తలంపుతో గుమిగూడి వాదమునకు వచ్చునంత విచ్చలవిడిఁ బద్మపాదాశిష్యవరు లతి ప్రగల్భవాక్యోపన్యాసముల గజయూధంబుల సింహపోతంబులట్ల యప్పాంచరాత్రుల నెల్లఁ బటాపంచలఁ గావించిరి.

అట్లు జగద్గురుండు శాక్త్రశైవవైష్ణవసౌర గాణపత్య కాపాలిక ప్రముఖప్రౌఢ మతంబుల ఖండించి తన్మతస్థుల నద్వైతబోధచే నుద్దరించి పంచపూజాపరాయణులం గావించిన కతంబున నమ్మహ్మాతునికి షణ్మతోద్ధారకుండని బిరుదమువచ్చినది. పదంపడి భట్టభాస్కరుం డుద్దండ పండితుండని విని యతనితో వాదించుతలంపుతో నగ్గురుం డుజ్జయినీపురంబున కరిగి యందుఁ గాళీశ్వరుని యాలయంబునఁ గళ్యాణమంటపంబున విశ్రమించి పద్మపాదుంజూచి వత్సా! మనరాక భట్టభాస్కరున కెఱింగించి రమ్ము. అతం డిందుఁ బ్రౌఢవాదియని పలికిన విని సమ్మోదమేదుర హృదయుండై యతండరిగి విబుధకులావతంసభూతుండును పునఃపునర్వ్యాకృతనిగమ సంఘాతుండును ప్రతివాది ధ్వాంత భాస్కరుండునగు భట్టభాస్కరుంగాంచి యర్చితుండై స్వాగతపూర్వకముగా నాగమనకారణం బడుగఁబడి గంభీరస్వరంబున -

సీ. కుమతవాద్యున్మత్త కుంభికంఠీరవుం
            డాగమశీర్ష తత్త్వార్థవేది
    దర్శితాద్వైత విద్యారహస్యవిశేషుఁ
            డఖిలదిక్చయతడ వ్యాప్తకీర్తి
    యంగభూగర్వప్రభంగ పావనమూర్తి
            ప్రౌఢార్ధయుత సూత్ర భాష్యకర్త