పుట:కాశీమజిలీకథలు-05.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ శంకరాచార్య చరిత్రము

183

జర్వాకుండు తదుపదేశాలాభంబునంజేసి యాత్మీయ వేషభాషల విడిచి పుస్తకముల మోయుపనిఁబూని యతిని నాశ్రయించెను.

తరువాత నయ్యతిపురందరుం డెదుర నిలువంబడియున్న పీనకాయుండగు సౌగతుంజూచి నీవెవ్వండవు ఏమి చెప్పెదవని యడిగిన ననుస్కరింపుచు నిట్లనియె. స్వామీ ! మూఢభావంబునంజేసి కర్మశీలురగువారు స్నానదానాదికములచే శరీరమును క్లేశపరచుచుందురు భౌతిక శరీరము స్నానాదులవలన శుద్ధియగునా? జీవుండు దేహపాతంబున వెండియు కర్మఋణాపనయనార్ధమై జనియించునని చెప్పుదురు. ఇదియు మరియు మూర్ఖతగదా. దేహాంతరమున నేమియు లేకపోవుటచేత ఋణమైనంజేసికొని ఘృతము త్రాగవలయునని మా సిద్ధాంతము.

శ్లో. దేహాంతేవాక్షణాభావాదృణం
    కృత్వాఘృతంపిబేత్ .

ఇత్యాది ప్రమాణ వాక్యంబులవలన సర్వదా దేహపుష్టి చేసికొనఁదగినది. బుద్ధిమంతుఁడైనవాఁడు అక్కడక్కడ ధనము సంపాదించుకొని సుఖముగాఁ దినుచుండ వలయును సర్వరక్షణశీలుఁడే నేర్పరి. దనభోగమే స్వర్గమని తలంపవలయును. నియమంబుల దేహమును బాధింపఁగూడదు. ఒక దేహము కష్టపడి మరియొక దేహమును సుఖపెట్టు టెట్టు తటస్థించెడిని కర్మ బూటకమని పలికినవిని శంకరాచార్యులు నవ్వుచు నిట్లనిరి. మూర్ఖుఁడా! దానంజేసియేకాఁబోలు నీవిట్లు శరీరమును బోషించు కొని బలసియుంటివి చాలు. చాలు. నీ మతము కడువిపరీతము శ్రుతిష్మృతీతిహాసాదులయందుఁ గర్మభోగము కొఱకుఁ బరిలోకగమనాదికము కడుసారులు వర్ణింపఁబడియున్నది. కావున పూణాదికము చేయఁగూడదు చేసెనేని తదనుభవమునకు జన్మమెత్తవలయును. నీవీ యజ్ఞానబుద్ధివిడిచి సన్మార్గమవలంబింపుమనుటయు వాఁడు మరల నిట్లనియె. అయ్యా మహర్షియైనసుగతుండు భూమినంతయుం జూచి విస్మయము నొందుచుఁ బ్రాహ్మణ్యుపాసన తత్పరుండై జగద్దితముగా నెల్లరకు నిట్లుపదేశించెను.

శ్లో. అహింసా పరమోధర్మః అని యెల్లప్పుడు స్మరించుకొను చుండ వలయును. అహింసకన్న పుణ్యకర్మ మెందునులేదు భూతదయయే సర్వధర్మములును. అహింస వలననే ముక్తినొందెదరని యానతిచ్చెను. కావున నేనును తద్వచనమేనమ్మి జీవహింసకు వెఱచుచు నియమముగా వర్తింపుచుంటిని.

వైదికులు యాగాదులయందు, బశుహింస గావింపుచుందురు అది మహా పాతకము. మా మతమే పరమధర్మస్థానమైనది. మీరు సైతము దీనిం గైకొనుడని పలికిన శంకరుండిట్లనియె. సౌగతా ! యూరక ప్రేలెదవేల ? దుష్టుడా ! నీకు ధర్మ సూక్ష్మమేమి తెలియును ? యాగంబులం జెప్పఁబడిన హింస పరమధర్మమని నిగమంబునఁ జెప్పఁబడియున్నది అగ్నిష్టోమాదిక్రతువులయందుఁ గావించిన పశుహింస