పుట:కాశీమజిలీకథలు-05.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

182

కాశీమజిలీకథలు - ఐదవభాగము

యవివేకి మెందైనం గలదా ? మరియుఁ బరంబున స్వర్గనరకంబులున్నవని పుణ్యపాపములచే నాయా యీ లోకంబులకుంజని యందందు సుఖదుఃఖము లనుభవించి తిరుగ భూలోకంబున జనియించుచుందురనియుం జెప్పుదురు. ఆ మాట వట్టిబూటకము. ప్రమాణశూన్యమైనది. యేమిటికంటిరేని వినుండు.

సుఖదుఃఖానుభూతి యైహికమునందేయున్నది. తదుభయమున స్వర్గనరకములనిపేరు. సుఖభోక్త స్వర్గియనియు దుఃఖభోక్త నిరయస్థుండనియుం జెప్పఁబడుచుందురు. ఇట్టి ప్రత్యక్షానుభూతి విడిచి పరోక్ష కల్పనలుచేసి లోకులను వంచించుట దౌష్ట్యము కాదా ! దేహేంద్రియాదిభూతములిచ్చటనే నష్టములగుచుండఁగాఁ బరంబున కరుగువాఁడెవ్వఁడు. జీవుండంటివేని ఘటనాశనమందు ఘటాకాశమువలెనే రూపహీనునికి గమనంబెప్పుడును సంభవింపదు. కావున మా మతమే లెస్సయైనది. మీ మతము ప్రత్యక్షవిరోధమైనదని పలికినవిని శంకరాచార్యులిట్లనిరి.

మూఢుఁడా ! చార్వాకుఁడా ! నీ మతము శ్రుతిబాహ్యమైనదగుట మన్నింపఁదగినదికాదు. చెడుబుద్ధివిడిచి మంచిమతంబెరింగించెద నాకర్ణింపుము. ఆత్మస్వరూపుండగు నా జీవుండు దేహాదులకు భిన్నుండై పరమాత్మయని చెప్పఁబడును. అప్పరమాత్మ అప్రభోధవలన విముక్తుండై జ్ఞాసలాభంబున దేహపాతము నొందక పోవుటయే ముక్తియని చెప్పఁదగినది. అంతియకాని నీవు చెప్పినది ముక్తికాదు. నీవు భ్రమపడి యట్లనుచున్నావు. నిశ్చయము. శ్రుతి జ్ఞానము వలననే ముక్తియని చెప్పుచున్నది.

శ్లో. జ్ఞానాగ్ని దగ్దకర్మాణో
    యాంతి బ్రహ్మసనాతనం॥

జ్ఞానాగ్నిచే దహింపఁబడిన కర్మలు కలవారు అనగా బ్రహ్మవేత్తలు సనాతనమగు బ్రహ్మను బొందుచున్నారని శ్రుతివాక్యములు గలవు.

శ్రుతిప్రమాణము సమ్మతింపనంటివేని నీ మాటలే నమ్మదగినవియా? కుత్సితదేహంబు వహ్నిచే దగ్ధంబగుచుండగా జీవుండు లింగశరీరముతోఁ గూడుకొని పరలోకంబున కరుగును. జ్యోతిప్టోమాది వాక్యములే యిందులకుఁ బ్రమాణములు. జీవుడు జలగవలెనే యీ దేహమునుండి దేహాంతరమును స్వీకరించి పరలోకమున కరుగునని శ్రుతి వాదించుచున్నది. మరియు మృతుని ప్రేతత్వవిముక్తి కొరకుఁ దత్పుత్రాదులు శ్రాద్ధాదికము చేయవలయును. గయాదులయందుఁ బిండదానాదికముచే బితరులు పుణ్యలోకము నొందుదురనియు ననేక పురాణములలో జెప్పఁబడియున్నది. కావున జీవుండు మరణావసానంబున లింగశరీరము నాశ్రయించి పక్షి వలెనే యరుగునని శ్రుతసిద్ధాంతమైయున్నది. నీ మూఢత్వమును విడువుము. నా మాటల విశ్వాసముంచి యాశ్రయింపుము. మరుమాట పలికితివేని గెంటించెదసుమీ యని బలికినఁ