పుట:కాశీమజిలీకథలు-05.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

180

కాశీమజిలీకథలు - ఐదవభాగము

భగవంతుఁడగు భైరవుండు దేహపాతంబున జీవులకుఁ గలుగఁజేయుచుండును. సర్వజనసులభ సాధ్యమగు నిట్టిముక్తి మామతమందకాక మఱియొక మతమం దెందేనింగలదా? యని యుపన్యసించిన విని శంకరాచార్యులు.

ఓరీ ! కాపాలిక. నీవు స్త్రీజాతియంతయు గమ్యయేయని చెప్పుచున్నావు. సంతసించితిమి. కాని నీతల్లియెవ్వనికూఁతురో చెప్పుము.

కాపాలికుఁడు - దీక్షితుని కూఁతురు.

శంకరా — దీక్షితుండన నెవ్వడు.

కాపా - మా తండ్రియే.

శంకరా - ఎట్లయ్యెను?

కాపాలి — తాళవృక్షసంజాతమగు మద్యమును ద్రాగటచే తద్రసంబుఁ గ్రోలుటచే విశేషంబు ప్రత్యక్షముగాఁ గనంబడుచుండలేదా? జ్ఞానులు సైతముఁ బానము చేయుదురనుట మా సుప్రసిద్ధము కాదా ? సేవించినవారి నానందసాగరమున ముంచు సురాపానలాభంబునంజేసి యెదీక్షితుం డగుచున్నాఁడు. మద్యగంధవిముఖులు మా మతమున నిషేధింపఁబడుచున్నారు.

శంకరుఁడు — ఓహో! కాపాలికా! నీమతము సర్వోత్తమమైనది మీకు వెలఁదియుఁ బానము నిషేధములుకావు. నీవు నీ యిష్టము వచ్చినట్లు సంచరింపుము. మేము బ్రాహ్మణులను దండించి సుబుద్ధులంజేయ గంకణము గట్టికొంటిమి కాని యితరులగొడవ మాకేల ? పోపొమ్ము సంభాషణార్హుండవు కావని పలుకుచుండగఁనే శిష్యులు వానిం బట్టికొని దూరముగా గెంటి విడిచిపెట్టిరి.

చార్వాకాది మతఖండనము

అట్టిసమయమునఁ జార్వాకసౌగతక్షపణకాదు లొకచో సభజేసి యొండొరు సంభాషించుకొనిరి.

చార్వాకుఁడు — సౌగతా! జగంబంతయు మూర్ఖజనులచే నెట్లు వ్యాపింపఁ బడినదో చూచితివా? ఈ సన్న్యాసియాత్మను దేహాద్యతీతమైనదానిఁగా వక్కాణించుచు లోకుల మోసపుచ్చుచుండ వానినే యెల్లరును సేవింపుచున్నారు. న్యాయవాదులమైన మనలను జూచువాఁ డొక్కడుఁను గనంబడఁడేమి?

సౌగతు - లోకము మూఢబాహుళ్య మగుటచేతనే వీనిమాటలయందు విశ్వాసముకలదై యున్నది. పంచభూతవికారంబగు శరీరములకు స్నానదానాదికర్మ వలన శుద్ధియగునని చెప్పుచుండెడి వీని వచనములెంత సత్యములైనవో విచారించితివా?

క్షపణకుఁడు — అతం డెంత వంచకుండైనను దైవబలసంపన్నుండగుటచే వానియాటలు సాగుచున్నవి. కానిచోఁ గాపాలిక కులనాయకుండైన క్రకచు నెదురఁబడి